చచ్చుబడ్డ కాళ్లలో మళ్లీ చైతన్యం 

Re-consciousness in the broken legs

వెన్నెముకకు గాయమైతే కోలుకోవడం కష్టమంటారు. ప్రమాదం జరిగిన ఏడాదిలోపు పరిస్థితిలో మార్పు లేకపోతే శాశ్వత వైకల్యం తప్పదని ఇప్పటివరకు అనుకునే వారు. కానీ ఆరేళ్ల తర్వాత కూడా వెన్నెముక గాయం వల్ల చచ్చుబడిపోయిన కాళ్లను మళ్లీ చైతన్యవంతం చేయవచ్చునని లూయివిల్లే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారు.

కొన్నేళ్ల క్రితం లూయివిల్లే విశ్వవిద్యాలయానికి చెందిన కెనెడీ స్పైనల్‌ కార్డ్‌ ఇంజురీ రీసెర్చ్‌ సెంటర్‌లో వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న నలుగురిపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వెన్నెముకలోని నాడులకు చిన్నపాటి షాక్‌లు ఇవ్వడం... అదేసమయంలో బాధితులతో కొన్ని పనులు (వేళ్లు, కాళ్లు చేతులు కదిలించడం, కూర్చోవడం, నిలుచునే ప్రయత్నం చేయడం వంటివి) చేయించడం ద్వారా వారి కాళ్లలో కొంత చైతన్యం కలిగించడం సాధ్యమని తెలిసింది.

ఈ నలుగురిలో ఒకరైన ఆండ్రూ మియాస్‌ దాదాపు తొమ్మిది నెలలపాటు పరిశోధనశాలలో ఈ శిక్షణ పొందారు. ఆ తరువాత శిక్షణను ఇంట్లోనూ కొనసాగించారు. ఏడాది తరువాత కొన్ని మార్పులు చేర్పులతో మూడు నెలలపాటు మళ్లీ పరిశోధనశాలలో శిక్షణ పొందారు. మొత్తమ్మీద దాదాపు 34 నెలల తర్వాత మియాస్‌ తన మోకాళ్లను కదల్చగలిగారు.

ఎవరి సాయం లేకుండా ఒంటికాలిపై కూడా కొద్దిసేపు ఉండగలిగారు. వెన్నెముక గాయం ప్రాంతంలో కొత్త ఆక్సాన్లు పుట్టుకురావడం మొదలుకొని అనేక ఇతర కారణాల వల్ల ఆండ్రూ కాళ్లలో మళ్లీ కదలికలు వచ్చి ఉంటాయని, కరెంట్‌ షాక్‌లతో ఇచ్చిన శిక్షణ కూడా ఉపయోగపడి ఉండవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top