నిబంధనలు ఉల్లంఘించామని తెలియదు: పాక్‌

POK Says We Had No Idea We Breached The Airspace Agreement - Sakshi

ఇస్తామాబాద్‌: నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ హెలికాప్టర్‌పై భారత సైనికులు కాల్పులు జరిపిని విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) పర్యాటక మంత్రి ముస్తాక్‌ మిన్‌హాస్‌ స్పందించారు. ఆ సమయంలో తను హెలికాప్టర్‌లోనే ఉన్నానని, తనతో పాటు పీఓకే ప్రధాన మంత్రి రాజా ఫరూక్‌ హైదర్‌ ఖాన్‌, ఆయన భద్రతాధికారులు, ప్రొవిన్స్‌ విద్యాశాఖ మంత్రి ఇఫ్తికర్‌ గిలానీలను ఉన్నారని తెలిపారు. ‘ నిజానికి ఎయిర్‌స్పేస్‌ నిబంధనలు ఉల్లంఘించామని మాకు తెలియదు. మాపైకి కాల్పులు జరుగుతున్నాయని తెలుసుకున్నాం. మా గమ్యం చేరిన తరువాత ఆ కాల్పులు భారత్‌ నుంచి వచ్చాయని తెలిసింది.’ అని తెలిపారు.

నియంత్రణ రేఖ వెంబడి పూంచ్‌ జిల్లా గుల్పూర్‌ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చిన తెలుపు రంగు హెలికాప్టర్‌ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని భారత అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్‌ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్‌ పోస్ట్‌ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ వీడియోల్ని పాక్‌ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాక్‌పై మండిపడిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..ఎల్‌వోసీకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, పది కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు. (చదవండి: భారత గగనతలంలోకి పాక్‌ హెలికాప్టర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top