సంచలన తీర్పు: ముషారఫ్‌కు మరణశిక్ష

Pervez Musharraf Sentenced To Death - Sakshi

దేశద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్‌లోని లాహోర్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే.

ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేకంగా 2007 నవంబర్‌ 3న దేశంలో ఎమర్జెనీ విధించారు. ఈ సమయంలో దేశంలోని విపక్ష నేతలను, న్యాయమూర్తులను అక్రమంగా నిర్బందించారు. అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. కేసు విచారణ జరుగుతుండగానే దేశం విడిచి వెళ్లిపోయారు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా దిక్కరించారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top