ఆ వేదనే ఆమెను బలి తీసుకుంది

A Parkland Survivor Took Her Own Life - Sakshi

పార్క్‌లాండ్‌  ట్రాజెడీలో మరో విషాదం

మానసిక వేదనతో  సిడ్నీ ఐయోలో  ఆత్మహత్య

పోస్ట్‌ ట్రామటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌

ఫ్లోరిడాలోని  పార్క్‌లాండ్‌ కాల్పుల మారణహోమం గుర్తుందా ?  సరిగ్గా ఏడాది క్రితం  హఠాత్తుగా  క్లాసులోకి ఎంటరై, పిల్లలు, టీచర్లపై విచరణా రహితంగా కాల్పుల జరిపి 17మందిని పొట్టన పెట్టుకున్న ఆ దుర్ఘటన ఇపుడు మరో యువతిని  పొట్టన పెట్టుకుంది. ఈ విషాదం నుంచి అదృష్ట వశాత్తూ బతికి బయటపడిన ఓ యవతి అనూహ్యంగా ప్రాణాలు తీసుకుంది.  

దుండగుడి తుపాకీ గుళ్లనుంచి తప్పించుకున్నప్పటికీ తన స్నేహితురాలిని పోగొట్టుకున్నానన్న  మానసిక  వ్యధ ఆమెను  మహమ్మారిలా పట్టి పీడించింది.  చివరకు అదే ఆమె ప్రాణాలను బలితీసుకుంది.  దీంతో ఆమె కుటుంబంతో పాటు, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన  విద్యార్థుల కుటుంబాలు,  స్కూలు సిబ్బంది సహా పలువురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

పోస్ట్‌ ట్రామటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ అనే తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్న సిడ్నీ ఐయోలో (19) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తల్లి కారా వెల్లడించారు. ఐయోలోకు యోగా అంటే చాలా ఇష్టమనీ, వైద్యరంగంలో ప్రవేశించాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. కానీ  కాల్పుల్లో  తన ప్రాణ స్నేహితురాలు మెడోవ్‌ పాలక్‌ ప్రాణాలు కోల్పోవడంతో సిడ్నీ  బాగా కృంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  కాలేజీకి వెళ్లాలంటేనే వణికిపోయేదనీ, దీంతో చదువులో కూడా వెనకబడి పోయిందని తెలిపారు. ఎన్ని రకాల చికిత్స అందించినా, ఎంత ఊరట కల్పించినా, తన బిడ్డను కాపాడు కోలేకపోయామని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అటు పాలక్‌ సోదరుడు హంటర్‌ పాలక్‌ కూడా సిడ్ని ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. 

ఈ విషాదానికి సంవత్సరం ముగిసిన సందర్భంగా  2019, ఫిబ్రవరి 14న స్కూలు యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు రాజకీయవేత్తలు మృతులుకు నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంవత్సరం గడిచినా  చాలామంది విద్యార్థులను ఇంకా ఆ పీడకల వెంటాడుతోంది. దీంతో ఆ రోజంతా క్లాసులను ఆపివేసిన యాజమాన్యం విద్యార్థులకు  కౌన్సిలింగ్‌ ఇచ్చింది. కానీ ఇంతలోనే  సిడ్నీ ఆత్మహత్య వారిని కలిచి వేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు  సూచించారు. 

మరోవైపు ’ ప్రియమైన మన బిడ్డ, మన చెల్లి, మనందరి స్నేహితురాలు’    అంటూ సిడ్నీ మరణంపై  గోఫండ్‌మీ పేజీ  సంతాపాన్ని వెలిబుచ్చింది.  విరాళాలకు పిలుపునిచ్చింది. దీంతో  క్షణాల్లో 20వేల డాలర్లు సమకూరాయి. ఈ సొమ్మును సిడ్నీ తల్లికి అందజేస్తామని ప్రకటించింది. 

కాగా  అమెరికా ఫ్లోరిడా,  పార్క్‌లాండ్‌లోని మర్జోరి స్టోన్‌మాన్‌ డగ్లస్ హై స్కూల్లో అదే స్కూల్ కు చెందిన పాత విద్యార్థి నికోలస్ క్రూజ్ ఎఆర్‌ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో స్కూల్లో టీచర్లు, విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది క్లాస్ లోనే ర్యాక్ లు, డెస్కుల కింద దాక్కున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన  ఈ ఘటనలో 17మంది  (14 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు) చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top