ఆల్‌ఖైదా వర్సెస్ ఐఎస్ఐఎస్!
మాలిలో జరిగిన తాజా ఉగ్రవాద దాడి ఓ విషయాన్ని బట్టబయలు చేసింది.
	బీరుట్: మాలిలో జరిగిన తాజా ఉగ్రవాద దాడి ఓ విషయాన్ని బట్టబయలు చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలైన ఆల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ మధ్య అస్సలు పొసగడం లేదని, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు శత్రువులుగా వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని చాటింది. ఆఫ్రికా దేశం మాలిలో ఓ హోటల్‌లో ఆల్‌ఖైదాకు చెందిన అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాడులకు తెగబడి 18మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. భద్రతా దళాలు హోటల్‌లో చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో ఈ ఆపరేషన్ ముగిసింది.
	
	ఈ ఆపరేషన్ ఇలా ముగిసిందో లేదో.. ఆన్‌లైన్‌లో ఆల్‌ఖైదా-ఐఎస్ఐస్ మద్దతుదారులు పరస్పర విమర్శలతో వాగ్యుద్ధానికి తెరలేపారు. మాలిలో దాడుల నుంచి ఐఎస్ఐఎస్ పాఠాలు నేర్చుకోవాలని ఆల్‌ఖైదా మద్దతుదారుడైన ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఆల్‌ఖైదా తరఫున తాను సిరియాలో ఫైటర్‌గా ఉన్నానని పేర్కొన్న అతను ఐఎస్ఐఎస్ వ్యూహాలను తప్పుబట్టాడు. 'అల్లాహు ఆలం'  పేరిట ఉన్న మరో యూజర్.. 'మాలి తరహా దాడులు చేయడం ఐఎస్ఐఎస్‌కు చేతకాదని దెప్పిపొడిచాడు. మాలిలో దాడి వారం రోజుల ముందు గత శుక్రవారం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పారిస్‌లో నరమేధం తలపెట్టి 130మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.
	
	ఐఎస్ఐఎస్ మొదట సిరియాలో ఆల్‌ఖైదా ఆధ్వర్వంలోనే పనిచేసింది. సిరియాలో వ్యూహాల విషయలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బయటకొచ్చిన ఐఎస్ఐఎస్ ఆ తర్వాత ప్రబల ఉగ్రవాద గ్రూపుగా మారింది. ఆల్‌ఖైదాను అధిగమించి.. అంతర్జాతీయంగా వణుకు పుట్టిస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య వైరం ఆన్‌లైన్‌లో తరచూ దర్శనమిస్తూనే ఉంది.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
