
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్‌కు గూఢచర్యం ఆభియోగంపై పాకిస్థాన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయాలన్న తీర్పుకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ సర్కార్ తలొగ్గింది. ఐసీజే తీర్పును అమలుచేయడానికి పాక్ సైనిక చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ సవరణ ఆధారంగా కుల్ భూషణ్ జాదవ్ తనకు విధించిన శిక్షపై సివిల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఆర్మీ చట్టంలో ఈ విధంగా సవరణలు చేపడుతున్నట్లు పాక్ మీడియా వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ బలగాలు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్ పిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని, మరణశిక్షను పాక్ సమీక్షించేంతవరకు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు నాయస్థానం ప్రకటించింది.