
నార్వే: నార్వే యువరాణి మార్తా లూయిస్(48) మాజీ భర్త, రచయిత అరి బెహ్న్(47) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్రిస్‌మస్ పండుగ రోజున నార్వే రాజు కింగ్ హెరాల్డ్V మాజీ అల్లుడు ఆత్మహత్యకు పాల్పడడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయయ్యారు. బెహ్న్ మరణించినటట్లు అధికారికంగా ఆయన మెనేజర్ ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం మెనేజర్ వెల్లడించలేదు. కాగా అరి బెహ్న్ గత కొద్దిరోజులుగా మానసిక సమస్యలతో సతమవుతున్నట్లు సమాచారం.
ఇక నార్వే రాజు, రాణి అరి బెహ్న్‌మృతిపై విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అరి ఎన్నో ఏళ్లుగా తెలుసని, అతనితో ఎన్నో మధురానుభూతులు పంచుకున్నామని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకడిగా కొన్నేళ్లపాటు ఉన్న అరి బెహ్న్‌ను చాలా దగ్గరినుంచి తెలుసుకున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. కాగా నార్వే యువరాణి మార్తా, నార్వేజియన్ రచయిత అరిబెహ్న్‌లు 2002లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు సంతానం. అభిప్రాయభేదాల కారణంగా వీరు 2017లో విడాకులు తీసుకున్నారు.




