తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..

Mother Shares Heartbreaking Footage Of Her Son - Sakshi

మెల్‌బోర్న్‌ : మరుగుజ్జు రూపమే ఓ విద్యార్థి బాధలకు కారణమైంది. స్కూల్లో తోటి విద్యార్ధులు అవమానాలకు గురిచేయటం తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ కన్నతల్లి ముందే కన్నీరుపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిస్‌బేన్‌కు చెందిన క్వాడెన్‌ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియా అనే మరుగుజ్జుతనం కారణంగా బాధపడుతున్నాడు. దీంతో స్కూల్లోని తోటి విద్యార్థులు అతన్ని బాగా అవమానించేవారు. అయినా అతడు వారి మాటలను భరించేవాడు. కానీ, వారి అవమానాలు రోజురోజుకు పెరగసాగాయి.

గత బుధవారం రోజు కూడా క్వాడెన్‌ను తీవ్రంగా అవమానించారు. దీంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం తల్లి యర్రాక బైల్స్‌ అతడ్ని తీసుకెళ్లటానికి స్కూల్‌ దగ్గరకు వచ్చింది. మౌనంగా కారులోకి వచ్చి కూర్చున్న అతడు ఏడవటం ప్రారంభించాడు. కొడుకు ఏడ్వటం గమనించిన తల్లి ఏమైందని అడిగింది. క్వాడెన్‌ తనకు జరిగిన అవమానాన్ని తల్లితో చెప్పుకున్నాడు. ‘నాకు తాడు ఇవ్వండి! నేను ఉరివేసుకుంటా. నా గుండెల్లో కత్తితో పొడుచుకుని చనిపోవాలనుంది.. లేకపోతే ఎవరైనా నన్ను చంపేయండి!.. నేను చనిపోవాలి.. నా ఒళ్లంతా గీసుకుంటా..’ అంటూ కన్నతల్లిముందు కన్నీరుమున్నీరయ్యాడు.

తల్లి యర్రాకతో క్వాడెన్‌
కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసిన యర్రాక దాన్ని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉంచింది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అన్ని వర్గాలనుంచి అతడికి మద్దతు తోడైంది. దీనిపై యర్రాక బైల్స్‌ స్పందిస్తూ.. ‘‘ మా అబ్బాయి అవమానాల పాలు కావటం కొత్తేమీ కాదు. అవమానాలు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం సూసైడ్‌ అటెంప్ట్‌ చేశాడు. మామూలుగా అయితే నేను ఇలాంటి విషయాలను సీక్రెట్‌గా.. స్కూల్‌ ప్రిన్సిపల్‌కు చెప్పి ఊరుకునే దాన్ని. కానీ, ఓ పసివాడు పడుతున్న బాధను అందరూ తెలుసుకోవాలని, తల్లిదండ్రులు, పిల్లలు జాగ్రత్తపడాలని నేను వీడియోను పబ్లిక్‌ ముందు ఉంచాన’ని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top