స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లండన్‌

London Named World's Best Student City - Sakshi

విద్యార్థులకు అత్యంత ఉత్తమ నగరంగా ఎంపిక

టాప్‌–120 ఉత్తమ విద్యార్థుల నగరాల లిస్ట్‌ విడుదల

భారత్‌ నుంచి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై

లండన్‌: ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వెనక్కినెట్టి వరుసగా రెండోసారి విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా బ్రిటన్‌ రాజధాని లండన్‌ సిటీ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ నగరాలైన టోక్యో, మెల్‌బోర్న్‌లు వరుసగా రెండు, మూడు ర్యాంకులను సాధించాయి. విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితాను బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌) బుధవారం విడుదల చేసింది. ప్రతీ నగరానికి సంబంధించి ప్రధానంగా ఆరు అంశాలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.

అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, జనాభా, జీవన ప్రమాణాలు, డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలు, కొనుగోలు సామర్థ్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు వంటి అంశాలు ఆయా నగరాల్లో ఏ మేరకు ఉన్నాయో విశ్లేషించి జాబితా రూపొందించింది. మొత్తం ప్రపంచంలోని 120 నగరాలకు సంబంధించి ఈ ర్యాంకులను విడుదల చేయగా.. భారత్‌ నుంచి బెంగళూరు 81వ ర్యాంకు, తర్వాత ముంబై–85, ఢిల్లీ–113, చెన్నై–115వ స్థానాల్లో నిలిచాయి.  

పెరుగుతున్న భారతీయ విద్యార్థులు..
భారతదేశం నుంచి లండన్‌కు విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017–18లో ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. 2017–18లో మొత్తం 5,455 మంది విద్యార్థులు లండన్‌లో విద్యాసంస్థల్లో చేరగా.. 2016–17లో ఆ సంఖ్య 4,545గా ఉంది. అయితే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం వీసా జారీ ప్రక్రియ నిబంధనలు కొంతమేర కు కఠినతరంగా ఉండటంతో భారతీయ విద్యార్థులు లండన్‌ వైపు మొగ్గు చూపట్లేదని నివేదిక పేర్కొంది.  

అందుకే అగ్రస్థానం
లండన్‌లోని విద్యార్థుల హర్షం
విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్‌ ఎంపిక కావడం పట్ల అక్కడి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఉత్తమ నగరంగా లండన్‌ ఎంపిక సరైనదేనంటున్నారు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు, వైవిధ్యభరితమైన విద్యార్థి సంఘాలు వంటివి లండన్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టాయని వివరిస్తున్నారు.

యూరప్‌ ఆధిపత్యం
టాప్‌–120 సిటీల్లో యూరప్‌ నగరాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జర్మనీలోని మ్యూనిచ్‌ 4, బెర్లిన్‌ 5వ స్థానాల్లో నిలిచాయి. పారిస్‌ 7వ స్థానం, జ్యూరిచ్‌(స్విట్జర్లాండ్‌) 8వ స్థానం దక్కించుకున్నాయి. మాంట్రియల్‌ (కెనడా) 6వ స్థానం, సిడ్నీ(ఆస్ట్రేలియా) 9వ స్థానం, సియోల్‌(దక్షిణ కొరియా) 10వ స్థానంలో ఉన్నాయి. ఇక టాప్‌–30లో మరో రెండు బ్రిటిష్‌ నగరాలైన ఎడిన్‌బర్గ్‌ 15వ ర్యాంకు, మాంచెస్టర్‌ 29వ ర్యాంకు పొందాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top