సోలో ట్రావెల్‌ సో బెటరూ..

Indian Women Who Made Foreign Trips Alone Were 47 Percent - Sakshi

ఒంటరిగా విదేశీ యాత్రలు చేసిన భారతీయ మహిళలు 47శాతం

    ఒంటరిగా విదేశీ ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహించిన గ్లోబల్‌ సోలో ట్రావెల్‌ స్టడీ ప్రకారం – ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 శాతం మంది మహిళలు స్వతంత్రంగా ప్రపంచ దేశాలు చుట్టొస్తున్నారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో 75 శాతం మంది సోలో ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఆసక్తులకు అనుగుణంగా గడపడానికి,  తమ గురించి తాము తెలుసుకోవడానికి  ఒంటరి ప్రయాణాలను ఒక సాధనంగా మలచుకుంటున్నారు.  ఇండియా,  బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, చైనాల్లో 18 – 64 వయోశ్రేణికి చెందిన 9,000 మందిపై జరిగిన ఈ సర్వేలో.. సంప్రదాయ ప్రయాణ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులు వెలుగుచూశాయి.

        ఒంటరి ప్రయాణాలు చేస్తున్న వారిలో ఇటలీ మహిళలు (63శాతం) ముందున్నారు. జర్మన్లు ఆ తర్వాత (60 శాతం) వున్నారు. ఆఖరులో అమెరికా స్త్రీలున్నారు.  ఒంటరిగా విదేశీయానం చేసే అమెరికా మహిళలు 17 శాతం మందే (పురుషులు 46 శాతం) కానీ, వారంతా దాదాపుగా ఆరునెలల ప్రయాణానికి మోగ్గు చూపే వారే.  చైనాలో పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు పదిసార్లు ఎక్కువగా ఒంటరి ప్రయాణాలు చేస్తున్నారు. మొత్తంగా.. 67 శాతం  మహిళా ప్రయాణికులు  తమ ఖండంలోని అద్భుతాలు ఆస్వాదించడం కోసం స్వల్ప కాలిక యాత్రలు చేస్తున్నారు. 

        50 శాతం మందికి పైగా స్త్రీలు స్వల్ప కాలిక ప్రయాణాలు ఎంపిక చేసుకుంటున్నారు. మార్కెట్‌ సర్వేల ప్రకారం – 3.05 కోట్లకు పైగా స్త్రీలు ఆరు మాసాలకు పైగా విదేశీ సందర్శనలో గడుపుతున్నారు. చాలా తరచుగా  విదేశీ యాత్రలు చేస్తున్న వారిలో జర్మనీ మహిళలు ముందున్నారు. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు ఏడాదికి పదిసార్లకు పైగా ప్రయాణాలు గడుతున్నారు. 50 శాతం మంది తమకు చాలా దూరంగా వున్న చైనా యాత్రకు పోతున్నారు. 

భారతీయ యువతుల జోరు.. 
     మన దేశంలో కనీసం రెండు నుంచి ఐదుసార్లు ఒంటరి ప్రయాణాలు చేసిన మహిళలు 47 శాతం మంది.  వీరిలో అత్యధికులు 18 – 25 ఏళ్ల యువతులే. 37 శాతం మంది భారతీయ మహిళలు ఒంటరిగా ఐరోపా దేశాలు తిరిగొచ్చారు. 33 శాతం మంది  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, మధ్య ప్రాచ్య దేశాలు సందర్శించారు. 30 శాతం మంది రెండు మూడు మాసాల్లో ఒంటరిగా విదేశాలు సందర్శించబోతున్నట్టు చెబుతున్నారు. థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, శ్రీలంక దేశాలకు ఒంటరి ప్రయాణాలు సర్వసాధారణమయ్యాయి. 

స్వేచ్ఛగా.. కోరినట్టుగా.. 
    ఒంటరి ప్రయాణాల్లో స్వేచ్ఛ వుంటుంది.. అందుకే సోలో ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాం.. అంటున్నారు 55 శాతం మంది. ఇష్టమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కోరుకున్నది తినొచ్చు. కోరిన చోట తిరగొచ్చు.  ఈ వెసులుబాటు కోసమే సోల్‌ ట్రిప్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని చెబుతున్నారు. సరికొత్త అనుభవాలు.. కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడాలు.. వంటివి కూడా తమ ప్రాధాన్యతల జాబితాలో వున్నాయంటున్నారు 55 శాతం పైగా భారతీయ మహిళలు. మారుతున్న ప్రయాణ పోకడలపై వ్యాఖ్యానిస్తూ.. స్త్రీలు ఒంటరి ప్రయాణాన్ని తప్పుగా పరిగణించే ఆలోచనలకు కాలం చెల్లిందంటున్నారు సోలో ట్రిప్స్‌ ఏర్పాట్లు చూసే ట్రావెల్‌ బ్లాగర్‌ జన్నా వన్‌ డిజ్క్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top