అమెరికాలో హ్యాకింగ్.. భారత విద్యార్థి అరెస్టు! | indian origin student arrested in usa for hacking | Sakshi
Sakshi News home page

అమెరికాలో హ్యాకింగ్.. భారత విద్యార్థి అరెస్టు!

Dec 14 2016 11:23 AM | Updated on Sep 4 2017 10:44 PM

అమెరికాలో హ్యాకింగ్.. భారత విద్యార్థి అరెస్టు!

అమెరికాలో హ్యాకింగ్.. భారత విద్యార్థి అరెస్టు!

అమెరికాలో ఒక చాట్ సైట్‌ మీద సైబర్ దాడులు చేసిన నేరంలో భారత సంతతికి చెందిన ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని అరెస్టుచేశారు.

సాంకేతిక విజ్ఞానం పక్కదారి పడితే ఇలాగే ఉంటుంది. అమెరికాలో ఒక చాట్ సైట్‌ మీద సైబర్ దాడులు చేసిన నేరంలో భారత సంతతికి చెందిన ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని అరెస్టుచేశారు. కృష్ణమకుటో శర్మ అనే ఈ విద్యార్థిని లాస్ ఏంజెలిస్‌లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రూ. 67 లక్షల బాండ్ మీద వదిలిపెట్టినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. 'డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్' (డిడాస్) అనే పద్ధతి ద్వారా శాన్ ఫ్రాన్సిస్కోలోని చాటాంగో అనే కంపెనీకి చెందిన కంప్యూటర్లను శర్మ హ్యాక్ చేశాడు. ఆ సంస్థ ఇతర కంపెనీలకు చాట్ సర్వీసులు అందిస్తుంది. 2014 నవంబర్ నుంచి 2015 జనవరి వరకు ఆ సంస్థ కంప్యూటర్లు పనిచేయలేదు. డిడాస్ అనే పద్ధతిలో సైబర్ దాడులు చేస్తే.. ఒక్కసారిగా బోగస్ రిక్వెస్టులు వెల్లువెత్తి, చివరకు ఆ వ్యవస్థ పనిచేయకుండా పోతుంది. 
 
బోట్‌నెట్స్ అనే తరహా వైరస్‌లు, ప్రోగ్రాంలను ఇది ఉపయోపగించుకుని సర్వర్లలకు రోబోటిక్ పద్ధతిలో రిక్వెస్టులను పంపుతుంది. కంప్యూటర్లలోకి ట్రోజన్లను విజయవంతంగా పంపి, వాటిద్వారా సైబర్ దాడులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎక్స్‌ట్రీమ్ ఫైర్ అనే తరహా బోట్‌నెట్‌ను శర్మ ఉపయోగించినట్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. కాగా, శర్మను విచారించిన జడ్జి కూడా భారతీయ అమెరికన్ మహిళే కావడం గమనార్హం. ఆమె 2013లో మొట్టమొదటి భారత అమెరికన్ మహిళా ఫెడరల్ జడ్జిగా నియమితులయ్యారు. 
 
కాలిఫోర్నియా రాష్ట్రంలోని లా కెనడా అనే ప్రాంతంలో ఎఫ్‌బీఐ అధికారులు శర్మను అరెస్టు చేశారు. అతడు లాస్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుతున్నట్లు తెలిసింది. మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. వాళ్లలో చాలామంది 20 ఏళ్లలోపు వాళ్లేనని ఎఫ్‌బీఐ తెలిపింది. కంప్యూటర్ పరిజ్ఞానం రాగానే.. తర్వాత ఏమవుతుందో తెలియక చిన్న చిన్న సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఎఫ్‌బీఐలోని ఈసీ3 బృందం అధినేత స్టీవెన్ విల్సన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement