సోమరి.. అంతరించిపోరా మరి..

Homo erectus was the longest travellers  - Sakshi

- ఎవరీయన?  
ఈయనా.. మన పూర్వీకుడే.. ముత్తాతలకు ముత్తాత.. ఆ ముత్తాతలకు ముత్తాతకు దగ్గరి బంధువు టైపు రిలేషనన్నమాట.. దాదాపు 19 లక్షల ఏళ్ల క్రితం వాడు.. ఈయన జాతి పేరు..హోమో ఎరెక్టస్‌.. 

- ఏం పాపం.. డల్లుగా ఉన్నాడు? 
ఉండడా మరి.. వీళ్లు బద్ధకస్తులట.. సోమరిపోతులట.. మేమనడం లేదు.. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. వీళ్ల జాతి అంతరించిపోవడానికి అది కూడా ఓ కారణమని చెప్పింది. అందుకే బాబు.. కాస్త డల్లుగా ఉన్నాడు.. 

- పూర్తిగా చెప్పరాదా.. 
ఈ హోమో ఎరెక్టస్‌లు సుదూర ప్రయాణికుల టైపు. ఆఫ్రికా నుంచి శ్రీలంక, చైనా, ఇండోనేసియా, జార్జియా వంటి  ప్రాంతాలకు వలస వెళ్లారు. దాదాపు 1,40,000 ఏళ్ల క్రితం ఈ జాతి అంతరించిపోయింది. దీనిపై ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా హోమో ఎరెక్టస్‌ నివసించిన ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో కూడా పరిశోధనలు చేశారు. ఇందులో తేలిందేమిటంటే.. వీరు బేసిక్‌గా బద్ధకస్తులు. వనరులను సమీకరించుకోవడంలో.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకోవడం వంటి విషయాల్లో క్రియాశీలకంగా లేకపోవడం వంటి వాటి వల్ల ఈ జాతి నెమ్మదినెమ్మదిగా అంతరించిపోయిందని వారు తేల్చారు. అంతేకాదు.. వీరు తయారుచేసిన పనిముట్లు కూడా తక్కువ నాణ్యత కలిగినవి. ‘తమకు చుట్టుపక్కల ఏ రాయి దొరికితే దానితో పని కానిచ్చేసేవారు.

హోమో ఎరెక్టస్‌లు తయారు చేసిన పనిముట్లు
అది నాణ్యమైనదా కాదా అన్నదానితో పనిలేదు. సౌదీ అరేబియాలో మాకు దొరికిన పని ముట్లను పరిశీలిస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే.. అక్కడికి దగ్గర్లోనే ఓ కొండ ఉంది. అక్కడ నాణ్యమైన రాయి ఉంది. కానీ.. అక్కడ దొరికిన పనిముట్లలో ఆ రాయితో చేసినవి ఏమీ లేవు. అలాగని.. కొండ వద్ద తవ్విన ఆనవాళ్లూ లేవు. కొండ కింద పడిన వాటిని ఏరుకుని.. పనిముట్లు తయారుచేసుకున్నారు. దగ్గర్లో దొరుకుతున్నాయిగా.. కష్టపడటమెందుకు అనుకున్నారు’ అని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ షిప్టన్‌ అన్నారు. అదే తొలితరం హోమోసేపియన్లు, నియాండర్‌తల్‌లు వేరేగా ఉండేవారని.. వీరు కొండలు ఎక్కి మరీ, నాణ్యమైన రాళ్లను ఎంపిక చేసుకునేవారని..అవసరమైతే సుదూర ప్రాంతాలకు తరలించేవారని ఆయన చెప్పారు. ‘అంతేకాదు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హోమో ఎరెక్టస్‌లు తమ జీవిత విధానాన్ని మార్చుకోలేదు.. మూస పద్ధతులనే అనుసరిస్తూ పోయారు.. ప్లానింగ్‌ కూడా సరిగా ఉండేది కాదు. దీంతో క్రమేణా అంతరించిపోయారు’ అని చెప్పారు. 
అదండీ.. సంగతి.. బద్ధకానికి బ్రాండ్‌ అంబాసిడరైన మనోడి గతి.. 
- సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top