వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?

Godzilla Size Alligator appears in Florida Golf Court - Sakshi

ఫ్లోరిడా : రాక్షస బల్లుల జాతికి చెందిన గాడ్జిలా గురించి హాలీవుడ్‌ చిత్రాల్లో చూసుంటారు. అయితే పరిమాణంలో ఆ సైజులో కాకపోయినా.. కాస్త భయానకంగా ఉన్న మొసలి ఒకటి గోల్ఫ్‌ కోర్టులో చక్కర్లు కొట్టింది. ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

పోప్‌ గోల్ఫ్‌ మైదానంలో ఈ మధ్య బఫెల్లో క్రీక్‌ గోల్ఫ్‌ కోర్స్‌ పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 14న గేమ్‌ ప్రారంభానికి ముందు అక్కడే ఓ కొలనులో ఉన్న భారీ మొసలి ఒకటి హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మైదానంలో పని చేసే వ్యక్తి ఒకతను తన మొబైల్‌ తో వీడియో తీయటం ఆరంభించాడు. అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లటంతో వారు స్పందించారు. 

సుమారు పాతికేళ్ల క్రితం ఓ మొసలి ఇదే ప్రాంతంలో కనిపించిందని.. బహుశా ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. 2016లో కూడా ఇది ఓసారి కనిపించగా.. దానికి ‘చబ్స్‌’ అని పేరు పెట్టినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటిదాకా అది ఎవరి మీద దాడి చేసిన సందర్భాలు లేవనే వారంటున్నారు. మైదానంలో అది ఠీవిగా వెళ్తుంటే.. పక్షులు దాని వెనకాలే వెళ్లటం ఆసక్తికరంగా ఉంది.

ఫ్లోరిడాలో ఈ పరిణామంలో ఉన్న మొసలి ఇదేనని జంతు సంరక్షణ అధికారులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఈ వీడియోతో మైదానంలో అడుగుపెట్టేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top