
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ‘ఆమె’చిత్రం!
లింగ సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.
మెల్‌బోర్న్: లింగ సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోదేశంలో ఒక్కోరకమైన డిమాండ్ వినిపిస్తూనే ఉంది. లింగ వివక్షతను రూపుమాపేందుకు, ప్రజల్లో లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం విభిన్నంగా లింగసమానత్వంపై అవగాహన కల్పించనున్నారు. అక్కడి రహదారులపై ఉండే ట్రాఫిక్ సిగ్నళ్లలో ‘ఆమె’ చిత్రాన్ని పొందుపర్చారు. పాదచారులు రోడ్డు దాటేందుకు చిహ్నంగా వెలిగే లైటులో ఇకపై ‘ఆమె’ వెలిగిపోనుంది.
గతంలో కేవలం ‘అతని’ చిత్రాలతో కూడిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్లు మాత్రమే ఉండేవి. దీనిని సవాలు చేస్తూ.. ఆస్ట్రేలియాకు చెందిన 120 ఉద్యమ సంస్థలు పోరాటానికి దిగాయి. కేవలం పురుషులను ప్రతిబింబించే చిత్రాలను మాత్రమే కూడళ్లపై వినియోగంచడం లింగవివక్ష కిందకే వస్తుందని, లింగ సమానత్వాన్ని చాటిచెప్పేందుకు ‘ఆమె’ చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశాయి. ఈ పోరాటానికి విక్టోరియా రాష్ట్ర గవర్నర్ లిండా నేతృత్వం వహించారు. ఫలితంగా మెల్‌బోర్న్ నగరపాలక సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే ఇప్పుడు నగరవ్యాప్తంగా అన్ని కూడళ్లవద్ద సిగ్నళ్లను మార్చారు.