భారత సంతతి డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Fake drugs supply in america indo americans - Sakshi

ముఠాలోని 8 మందీ ఇండో–అమెరికన్లే

అమెరికాలోని న్యూయార్క్‌  కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ రాకెట్‌

న్యూయార్క్‌: నకిలీ బ్రాండింగ్‌తో భారీ ఎత్తున డ్రగ్స్‌ ఆధారిత మందుల వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠా కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. న్యూయార్క్‌ పరిధిలోని క్వీన్స్‌ కేంద్రంగా ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీస్‌ అధికారులు, 8 మంది భారత సంతతి అమెరికన్లను అరెస్ట్‌ చేశారు. అమెరికాలోని కొరియర్, పోస్టల్‌ సర్వీసుల ద్వారా వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు. ఈ విషయమై న్యూయార్క్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘సెషిజాన్‌ కమల్‌ దాస్‌(46), ముకుల్‌(24), గులాబ్‌ (45), దీపక్‌ (43), నారాయణ స్వామి(58), బల్జీత్‌ సింగ్‌(29), హర్‌ప్రీత్‌ సింగ్‌(28) వికాస్‌ వర్మ (45)లు భారత్‌ నుంచి నకిలీ బ్రాండింగ్‌తో నల్ల మందు ఆధారిత మందుల్ని అమెరికాలోకి భారీగా దిగుమతి చేసుకున్నారు. ఈ మందుల్లో హెరా యిన్, ఆక్సికొంటిన్, వికోడిన్, ట్రమడాల్, ఫెంటానేల్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ ఉంటాయి’ అని తెలిపారు.

రీ–ప్యాకింగ్‌తో కోట్ల ఆదాయం..
నిందితులు తమ డ్రగ్స్‌ వ్యాపారానికి న్యూయార్క్‌ పరిధిలో క్వీన్స్‌ పట్టణాన్ని కేంద్రంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ పట్టణంలోని ఓ గోదామును అద్దెకు తీసుకున్న 8 మంది నిందితులు.. భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను తమ వినియోగదారులకు పంపేవారు. ఇందుకోసం ప్రభుత్వ పోస్టల్‌ సర్వీసుతో పాటు ప్రైవేటు కొరియర్‌ సంస్థల సేవలను హాయిగా వాడుకున్నారు. మందులను రీప్యాక్‌ చేసి తమ వినియోగదారులకు, కొన్ని సంస్థలకు అందించడం మొదలుపెట్టారు. ఇలా 2018–19 మధ్యకాలంలో వీరు కోట్ల రూపాయలు ఆర్జించారు.    అయితే 2018 జనవరి నుంచి దేశంలోకి భారీగా నల్లమందు ఆధారిత డ్రగ్స్‌ దిగుమతి కావడంపై అమెరికా విచారణ సంస్థలు దృష్టి సారించగా ఈ అక్రమ అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి.  

డోస్‌ ఎక్కువైతే మరణమే..
సింథటిక్‌ డ్రగ్స్‌ ఉన్న మందులను  వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం ప్రమాదకరం. డోస్‌ ఎక్కువైతే  కోమాలోకి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో 8 మంది నిందితులను  బ్రూక్లిన్‌లోని ఫెడరల్‌ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువైతే కమల్‌దాస్‌కు 25 ఏళ్లు, మిగతా నిందితులకు ఐదేళ్లు జైలు శిక్ష పడే         అవకాశముంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top