ఒక్క ఫోటో.. ఇంటర్నెట్‌ షేక్‌ | Donald Trump Angela Merkel G7 summit photo Sparks Internet | Sakshi
Sakshi News home page

Jun 10 2018 12:21 PM | Updated on Jun 10 2018 3:57 PM

Donald Trump Angela Merkel G7 summit photo Sparks Internet - Sakshi

లా మాల్బె: రెండు రోజులపాటు జరిగిన సదస్సులో ఊహించని రీతిలో చర్చ.. చివర్లో ప్రతిష్ఠంభన... మిగతా దేశాలు ఏకం కావటంతో ఒంటరిగా మారిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వెరసి జీ-7 దేశాల సదస్సు గందరగోళ పరిణామాలతో సాగింది. సదస్సు ముగిశాక ట్రంప్‌ చేసిన ట్వీట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. 

జీ-7 సదస్సులో రెండో రోజు. రెండు వర్కింగ్‌ సెషన్ల మధ్యలో అనుకోకుండా జరిగిన భేటీ అంటూ ఆమె ఓ సందేశాన్ని ఉంచుతూ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చేతులు కట్టుకుని ఉన్న ట్రంప్‌.. చుట్టూ చేరి మిగతా దేశాల ప్రతినిధులు ఉండటం, బల్ల మీద చేతులేసి మెర్కెల్‌ సీరియస్‌గా ట్రంప్‌ను తదేకంగా చూస్తుండటం... వెరసి సోషల్‌ మీడియాలో ఫోటో నవ్వులు పూయిస్తోంది. జీ-7లో ట్రంప్‌ టైమ్‌ బాగోలేదని చాలా మంది కామెంట్లు చేస్తుండగా, మెర్కెల్‌ ముందు పిల్లిలా మారిపోయారంటూ మరికొందరు, ఇంకొందరైతే తమ శైలిలో ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ కాప్షన్‌లతో వైరల్‌ చేస్తున్నారు.

అమెరికాకు హెచ్చరిక... క్యూబెక్‌లోని లా మాల్బెలో జరిగిన సదస్సుల్లో వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్‌ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోకపోగా, హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను యూరప్‌ కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్‌ ఒప్పందం తదితరాలపై ట్రంప్‌ వైఖరిని తప్పుపట్టిన యూరోప్‌ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి. 

ఇక ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్‌ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్‌ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని కెనడా వాదించింది. మరోవైపు  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రన్‌ ఇమాన్యుయేల్‌ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయన్నారు. వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిన మాట వాస్తవమే అయినా, అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని ఆయన చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement