కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం!

Destroy Nuclear Sites Presence Of Foreign Media, Kim Jong un - Sakshi

ప్యోంగ్‌యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దక్షిణ, ఉత్తర కొరియాలలో ఒకే సమయం ఉండాలని కిమ్ భావించి తమ దేశ సమయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. భారీ అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తర కొరియా తన న్యూక్లియర్‌ పరీక్షలను ఈ నెలలోనే నిలిపివేయాలని భావిస్తోంది. ఈ మేరకు విదేశీ మీడియా సంస్థల సమక్షంలో అణ్వస్త్రాలను పరీక్షించే వేదికను ధ్వంసం చేసి, ఆపై మూసివేయనున్నట్లు కిమ్ తాజాగా ప్రకటించారు. 

తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా నియంత తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ ప్రకటనకు కట్టుబడి న్యూక్లియర్ ప్లాంట్‌ను ధ్వంసం చేసి అణ్వాయుధాలకు తాము కూడా వ్యతిరేకమని ప్రపంచానికి చాటిచెప్పాలని కిమ్ భావిస్తున్నారు. మే 23-25 తేదీలలో ఈ పని చేయనున్నట్లు నార్త్ కొరియా ఉన్నతాధికారులు వెల్లడించారు. కిమ్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వాగతించడంతో పాటు ప్రశంసించారు.

ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన తాజా నిర్ణయాలతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగా అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. కాగా, చైనాలోనూ పర్యటిస్తూ అగ్రదేశాలతో సత్సంబంధాల కోసం కిమ్ యత్నిస్తున్న విషయం విదితమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top