లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి

Coronavirus Spreads Easily Within Families Says Study - Sakshi

‘ది లాన్‌సెట్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీస్‌ జర్నల్‌’ నివేదిక

బీజింగ్‌/ న్యూఢిల్లీ‌ : కరోనా సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తున్నా, లేకపోయినా అతడితో కలిసి ఉండే వారికి వైరస్‌ తొందరగా వ్యాప్తి చెందుతుందని ‘ది లాన్‌సెట్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీస్‌ జర్నల్‌’ పేర్కొంది. కుటుంబాలలో లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని తెలిపింది. ఇంట్లో వారు లక్షణాలు లేకుండానే వ్యాధి బారిన పడిపోతారని, ఆ తర్వాత అనారోగ్యంపాలవుతారని వెల్లడించింది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువని తెలిపింది. చైనా, గాంగ్‌ఝౌ నగరంలోని 13మిలియన్ల జనాభాలోని 349 మంది కరోనా వైరస్‌ రోగులు, వారితో చనువుగా మెలిగిన 1,964 మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. కేవలం కుటుంబసభ్యుల్నే కాకుండా పనివాళ్లను, స్నేహితులను కలిసి ప్రయాణం చేసేవారిపై పరిశోధనలు చేశారు.

కుటుంబాలలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సరైన సమయంలో వైరస్‌ బాధితులను గుర్తించి, వారితో సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారంటైన్‌ చేయటం ఒక్కటే మర్గామని వారు పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఇంక్యూబేషన్‌ సమయంలో లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్‌ చేయటం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, హైదరాబాద్‌.. ప్రొఫెసర్‌ డా. వీ రమణ ధార మాట్లాడుతూ.. ‘‘  వైరస్‌ వ్యాప్తి చెందడానికి కుటుంబాలలో ఎక్కువ అవకాశం ఉంటుందని మనకు ముందే తెలుసు. ఎక్కువ మంది కలిసి ఉండే కుటుంబాలలోని వ్యక్తులు తొందరగా వైరస్‌ బారినపడతారు. ( కరోనా అలెర్ట్‌.. 6 లక్షల పరీక్షలు )

నోటి తుంపరల ద్వారా గాల్లో చేరే వైరస్‌ ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఇంక్యూబేషన్‌ పీరియడ్‌లో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ఎల్లవేళలా ధరించాలి. చాలా మంది ఇంటికి రాగానే మాస్కులు తీసేస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే రక్షణగా ఉన్నామని అనుకుంటారు. కానీ, భారతదేశంలోని ఇళ్లలో రోగాలు సోకే అవకాశం ఎక్కువ’’ అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top