కరోనా అలెర్ట్‌.. 6 లక్షల పరీక్షలు

Andhra Pradesh Created Record With 6 lakh Covid-19 Tests  - Sakshi

కోవిడ్‌ టెస్టుల్లో మరో మైలురాయి 

వారం రోజుల్లోనే లక్ష మందికి టెస్టులు 

రాష్ట్రంలో మరింత తగ్గిన మరణాల రేటు 

కొత్తగా 131 మంది డిశ్చార్జి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలురాయిని దాటింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 13,923 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షలు చేసిన వారి సంఖ్య 6,12,397కు చేరింది. రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షలు నిర్వహించడానికి 58 రోజులు పట్టగా.. ఇప్పుడు వారం రోజుల్లోనే లక్షకుపైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి  చేరుకుంది. జూన్‌ 10న 5 లక్షల మార్కును అందుకోగా వారం రోజుల్లోనే జూన్‌ 17న ఆరు లక్షల మార్కును అధిగమించింది. దీంతో ప్రతీ పది లక్షల మందికి సగటున 11,468 పరీక్షలు నిర్వహించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తూ త్వరితగతిన కరోనా సోకిన వారిని గుర్తించడం ద్వారా వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాన్ని ఇప్పుడు పలు రాష్ట్రాలు మెచ్చుకోవడమే కాకుండా అనుసరిస్తున్నాయి. 

మరింత తగ్గిన మరణాల రేటు 
రాష్ట్రంలో మరణాల రేటు మరింత తగ్గింది. జాతీయస్థాయిలో మరణాల రేటు 3.33 శాతంగా ఉంటే అది ఏపీలో 1.23 శాతంగా ఉంది. కృష్ణా జిల్లాలో కరోనా సోకిన ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 92కి చేరింది. కొత్తగా 425 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,496కు చేరింది. ఇందులో 5,854 కేసులు రాష్ట్రానివి కాగా, 1,353 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, 289 కేసులు విదేశాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. మరో 131 మంది డిశ్చార్జి అవడంతో కోలుకున్న వారి సంఖ్య 3,772కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,632గా ఉంది.

జబ్బులున్న వారిని.. జల్లెడపట్టి
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. ఆ వైరస్‌తో ముప్పు ఎక్కువగా ఉన్న వారిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. యువకులు, మధ్య వయస్కులు, పలు దీర్ఘకాలిక వ్యాధులు లేని వారికి కరోనా సోకినా పదిరోజుల్లోనే కోలుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్యంతో పాటు పలు వ్యాధులతో బాధపడేవారిని వైరస్‌ ఎక్కువగా కబళించే అవకాశం ఉంది. కంటైన్మెంట్‌ జోన్లు, నాన్‌ కంటైన్మెంట్‌ జోన్ల వారీగా వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. వారిని రక్షించే చర్యలు చేపట్టింది. ఇంటింటి సర్వే ద్వారా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండే వారిని గుర్తించారు. వారిని ఎలా కాపాడుకోవాలనే దానిపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం మొదలు క్యాన్సర్‌ వరకూ ఎంతమంది ఉన్నారో లెక్కలు వేసి అధికారులు కార్యాచరణ చేపట్టారు.

ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..
► వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న వారిని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు రోజూ పర్యవేక్షిస్తారు. 
► వారానికొక రోజు పీహెచ్‌సీ వైద్యుడితో అవగాహన కల్పించి అవసరమైన వారికి ï మందులు ఇంటికే తెచ్చిస్తారు. 
► దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులను బయటకు వెళ్లనీయకుండా కాపాడతారు. 
► అలాంటివారికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు.
► ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యం అవసరమైతే 108లో ఆస్పత్రికి తీసుకెళతారు. 
► కంటైన్మెంట్, నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో వృద్ధాప్యంలో పలు వ్యాధులతో బాధపడుతున్నవారు, కిడ్నీ, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉండగా, విజయనగరం జిల్లాలో తక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సేకరించిన వివరాల్లో స్పష్టమైంది. 

ఒక్కరు కూడా మృతిచెందకూడదని..
గడిచిన మూడు మాసాల్లో పలు దఫాలుగా జరిగిన ఇంటింటి సర్వేలో జబ్బులతో బాధపడేవారిని గుర్తించాం. వారిని కాపాడుకోగలిగితే మిగతా వారికి సోకినా ప్రమాదం ఉండదు. కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నాం. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కోవిడ్‌ సోకకుండా చూసేలా క్షేత్రస్థాయి సిబ్బందితో చర్యలూ తీసుకుంటన్నాం.
–డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ

వారిని కాపాడుకుంటే..
జబ్బులతో బాధపడే వారిని గుర్తించి, వైరస్‌ సోకకుండా చూడగలిగితే కరోనా నుంచి బయటపడినట్టే. ఇలాంటి వారిని గుర్తించేందుకు  కొన్నిరోజులుగా ఆశాలు, ఏఎన్‌ఎంలు తీవ్రస్థాయిలో కృషి చేశారు. రిస్క్‌ ఎక్కువ ఉన్న వారిని పరిరక్షించే విధంగా అన్ని ప్రాథమిక స్థాయి ఆస్పత్రులకు ఆదేశాలిచ్చాం.    
–భాస్కర్‌ కాటమనేని, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top