పది కోట్ల జీతం...శాండ్‌విచ్‌లకు కక్కుర్తిపడి..

Citigroup Suspends Senior Officer For Stealing Sandwich From Staff Canteen - Sakshi

లండన్‌ : యూరప్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీలతో అత్యధిక లాభాలు గడిస్తున్న ‘సిటీ గ్రూప్‌’ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పరాశ్‌ షా చిల్లర వేశాల కారణంగా బంగారం లాంటి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఏటా దాదాపు తొమ్మిదన్నర కోట్ల రూపాయల జీతం అందుకుంటున్న ఆయన లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నుంచి తరచుగా ఆహారాన్ని దొంగలిస్తున్నారట. పలుసార్లు శాండ్‌విచ్‌లు దొంగలించారట. ఆయన అలా ఎంతకాలం నుంచి ఎన్ని శాండ్‌విచ్‌లు దొంగలించారో తెలియదుగానీ, ఈ విషయం తెల్సిన యాజమాన్యం ఆగ్రహించి ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసినట్లు ‘ఫైనాన్సియల్‌ టైమ్స్‌’ పత్రిక వెల్లడించింది. 

పరాశ్‌ షా సెలవుల్లో వివిధ దేశాల్లో పర్యటించే అలవాటు ఉందని ఆయన ఫేస్‌బుక్‌ పేజీలు చూస్తే అర్థం అవుతోంది. ఆయన పెరూలోని ‘మాచు పిచ్చూ’ పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్లు ఆయన ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది. లండన్‌లోని ఎడ్మాంటన్‌లో గ్రామర్‌ స్కూల్‌లో చదవిన షా, బాత్‌ యూనివర్శిటీలో 2010లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. హెచ్‌ఎస్‌బీసీలో ఇన్‌కమ్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో ఏడేళ్లు పనిచేసి 2017లో సిటీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం యూరప్‌తోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.

అంత ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి శాండ్‌విచ్‌ డబ్బుల కోసం కక్కుర్తి పడడం చూసే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇలాగే కక్కుర్తి పడిన పలువురు బ్యాంకర్లు సస్పెండయిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఓ ఫ్రెండ్‌ బైక్‌ నుంచి 500 రూపాయల విలువచేసే ఓ పార్ట్‌ను దొంగలించినందుకు ఓ లండన్‌ బ్యాంకర్‌ను 2016లో జపాన్‌కు చెందిన మిజువో బ్యాంక్‌ ఉద్యోగం నుంచి తొలగించింది. బ్లాక్‌రాక్‌ ఎగ్జిక్యూటివ్‌ జోనాథన్‌ బుర్రోస్‌ టిక్కెట్లు తీసుకోకుండా రైల్లో ప్రయాణించి దొరికి పోయారు. బ్రిటన్‌ ఆర్థిక రంగంలో ఆయన ఎక్కడా పనిచేయకుండా ‘ఫైనాన్సియల్‌ కండక్ట్‌ అథారిటీ’ ఆయనపై నిషేధం విధించింది. ఆయన బ్రిటన్‌ ఆగ్నేయ రైల్వేకు 39 లక్షల రూపాయలను చెల్లించడం ద్వారా కేసును సర్దుబాటు చేసుకున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top