చర్చనీయాంశంగా మారిన చైనా అధికారి ట్వీట్‌

Chinese Diplomat Tweets A Twist to Ladakh Standoff Sees Link to Article 370 - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయ‌ అధికారి ఒకరు చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం దౌత్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని చైనా మిషన్‌లో ప్రెస్ ఆఫీసర్‌గా ఉన్న వాంగ్ జియాన్‌ఫెంగ్ ‘కశ్మీర్ యథాతథ స్థితిని మార్చడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వంటి భారతదేశం చర్యలు.. చైనా, పాకిస్తాన్ సార్వభౌమత్వానికి సవాలుగా మారాయి. భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలు, చైనా-ఇండియా సంబంధాలను మరింత క్లిష్టతరం చేశాయి’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ లేదా ప్రధాన ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో అనుబంధంగా ఉన్న ఒక ప్రభావవంతమైన సంస్థ స్కాలర్‌ కథనాన్ని ట్వీట్‌తో పాటు లింక్‌ చేశారు  వాంగ్‌.

ఈ కథనంలో సరిహద్దు ఉద్రిక్తతలు, కశ్మీర్ స్థితిలో మార్పు మధ్య సంబంధం వంటి అంశాలు ఉన్నాయి. లదాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే చైనా అధికారి సరిహద్దు వివాదాన్ని, కశ్మీర్‌తో ముడిపెట్టడం మాట్లాడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా వాంగ్‌ ట్వీట్‌ అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తుందంటున్నారు అధికారులు. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం కోసం ఇండియా, చైనా.. దౌత్య, సైనిక విధానాలను అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. (లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ)

గత ఏడాది ఆగస్టు 5న భారతదేశం జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను విమర్శిస్తూ రెండు ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ఒకటి రాష్ట్ర భూభాగాలుగా విభజించడంపై దృష్టి సారించింది. సరిహద్దు సమస్యపై భారతదేశం ‘జాగ్రత్తగా’ ఉండాలని.. సరిహద్దు సమస్యను మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించాలని ఈ ప్రకటన విజ్ఞప్తి చేసింది. అంతేకాక చైనా భూభాగాన్ని భారతదేశం అధికార పరిధిలో చేర్చడాన్ని చైనా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. (‘వాస్తవాధీన రేఖ’లో సామరస్యం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top