లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ

Article On China Strategy In Ladakh - Sakshi

యుద్ధోన్ముఖమైన తన జగడాలమారి స్వభావంతో చైనా ఈ సంవత్సరం ప్రారంభం నుంచే హిమాలయన్‌ మిలిటరీ విన్యాసాలను నిర్వహించడం ద్వారా.. భారత్‌ను అదను చూసి దెబ్బకొట్టింది. సాధారణంగా ప్రతి ఏటా లదాఖ్‌లో సైనిక విన్యాసాలు తలపెట్టే భారత్‌ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఇదే అదనుగా చైనా తన రిజర్వ్‌ సైన్యాలను పెంచుకుని పైచేయి సాధించింది. నెలరోజుల ప్రతిష్టంభన తర్వాత ఈ వారం ఇరుదేశాలూ నాలుగు ఘర్షణ ప్రాంతాల్లో మూడింటి నుంచి తమ బలగాలను పరస్పర చర్చలతో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడంతో యుద్ధ ప్రమాదం తగ్గిపోయింది కానీ అది చైనా యుద్ధోన్ముఖ తత్వాన్ని మాత్రం తగ్గించలేకపోయింది. లదాఖ్‌ సరిహద్దుకు సమీపంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పీఎల్‌ఏ ఇప్పటికే తిష్టవేసి కూర్చోవడంతో లదాఖ్‌ లోని రెండు భారతీయ పార్శా్వలపై ఏకకాలంలో ఒత్తిడి పెంచాలని చైనా భావిస్తోంది. భారత్‌ తన విదేశీ, రక్షణ విధానాలను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి.

భారత్‌ ఎప్పటిలాగే చైనాకు స్నేహహస్తం అందించింది కానీ చైనా మాత్రం లదాఖ్‌లో రహస్య దాడితో భారత్‌కు బదులిచ్చింది. అత్యంత వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత్‌ముందు కార్గిల్‌ తరహా సవాలును విసిరాయి. చైనా తాజా దురాక్రమణ భారత్‌కు వట్టి మేలుకొలుపు మాత్రమే కాదు.. చైనా పట్ల భారత్‌ వైఖరిని ప్రాథమికంగానే మార్చివేయడంలో నిర్ణయాత్మక అంశమని విస్పష్టంగా రుజువైంది కూడా. పలు అధ్యయనాలు చాటి చెబుతున్న విధంగా, ఆకస్మిక దాడి ద్వారా.. తన బలగాలను మళ్లీ మళ్లీ ఉపయోగించే విషయంలో సరైన సమయాన్ని ఎంచుకోవడం చైనా సైనిక వ్యూహంలో కీలకమైన అంశం. 1962లో క్యూబన్‌ క్షిపణి సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని అణ్వాయుధ అంతిమ యుద్ధంలోకి నెట్టివేసిన సమయంలో, చైనా అదను చూసుకుని భారత్‌పై దురాక్రమణ దాడిని కొనసాగించింది. ఈ ఏప్రిల్‌–మే నెలల్లో కరోనా వైరస్‌ (కోవిడ్‌–19)పై సమరంలో తలమునకలవుతూ భారత్‌ కాస్త పరధ్యానంగా ఉంటున్న సమయంలో లదాఖ్‌ లోని గాల్వన్‌ వేలీ, హాట్‌ స్ప్రింగ్స్‌ను చైనా ఆక్రమించుకుంది. అదేసమయంలో ప్యాంగాంగ్‌ సరస్సు పరిధిలో ఫింగర్స్‌ 4, 8 మధ్య ఉన్న విశాలమైన వివాదాస్పద ప్రాంతాన్ని కూడా చైనా ఆక్రమించుకుంది. 

ప్రాచీన చైనా సుప్రసిద్ధ సైనిక వ్యూహకర్త సన్‌జు సూచనకు అను గుణంగానే, భారత్‌ దుర్బల స్థితిలో ఉంటున్న తరుణంలో చైనా తాజాగా దాడికి పాల్పడింది. ప్రపంచంలోనే అత్యంత కఠినంగా అమలు చేసిన లాక్‌ డౌన్‌ వల్ల భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం తగ్గుముఖం పట్టిందో లేదో కానీ, స్థూల దేశీయోత్పత్తి మాత్రం దారుణంగా పడిపోయింది.దీంతో భారత్‌ ఇప్పుడు రెండు విధాలుగా ఘోర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకటి, కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూ పోవడం, రెండు, ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినిపోవడం. వీటివల్లే చైనా దురాక్రమణపై భారత్‌ సైనికచర్యలకు సాహసించలేకపోయింది. యుద్ధోన్ముఖమైన తన జగడాలమారి స్వభావంతో చైనా ఈ ఏడాది ప్రారంభం నుంచే హిమాలయన్‌ మిలిటరీ విన్యాసాలు నిర్వహించడం ద్వారా భారత్‌ను అదనుచూసి దెబ్బకొట్టింది. ప్రతి ఏటా లదాఖ్‌లో సైనిక విన్యాసాలు తలపెట్టే భారత్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఇదే అదనుగా చైనా తన రిజర్వ్‌ సైన్యాలను పెంచుకుని పైచేయి సాధించింది. 

ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన భారత్‌ కరోనాపై యుద్ధం చేస్తూనే కఠినమైన ఎంపికల సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. తన సైనిక బలగాలకు వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో చైనా దురాక్రమణకు తగు సమాధానం చెప్పే మార్గాన్ని భారత్‌ ఎంచుకోలేకపోయింది. దీంతో తూర్పు లదాఖ్‌లో ఎదురుదాడి చేసే బలగాలను చైనా అసాధారణంగా మోహరించింది. అయితే నెలరోజుల ప్రతిష్టంభన తర్వాత ఈ వారం ఇరుదేశాలూ నాలుగు ఘర్షణ ప్రాంతాలకు గానూ మూడింటి నుంచి తమ బలగాలను పరస్పర చర్చలతో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడంతో యుద్ధ ప్రమాదం తగ్గిపోయింది కానీ అది చైనా యుద్ధోన్ముఖ తత్వాన్ని మాత్రం తగ్గించలేకపోయింది.

చైనా తాను ఎంచుకున్న లక్ష్యాల నుంచి ఏమాత్రం వెనుకడుగు వేయడం కానీ పక్కకు పోవడం కానీ చేయదనడానికి 2017లో డోక్లామ్‌ సరిహద్దు ప్రాంతంలో దాని సైనిక ఉపసంహరణ తంతు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. అప్పట్లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కాస్త ముగియగానే చైనా శాశ్వత సైనిక నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టడం ప్రారంభించింది, ఆ విధంగా అది మొత్తం డోక్లామ్‌ ప్రాంతాన్నే కైవసం చేసుకునే పరిస్థితిని సృష్టించుకుంది. కొన్నేళ్ల క్రితం లదాఖ్‌లోని డెప్సాంగ్‌ ప్లెయిన్స్‌ (2013), చుమార్‌ (2014) ప్రాంతాల్లో అనధికారికంగా చొరబడ్డ ఘటనలతో పోలిస్తే చైనా తాజా దురాక్రమణ దాడి పూర్తిగా విభిన్నమైంది. అప్పట్లో చైనా పరిమితమైన ఎత్తుగడలతో కూడిన లక్ష్యాలను ఎంచుకుని లదాఖ్‌లో చొరబాటుకు సిద్ధపడింది. భారత్‌ ఆత్మరక్షణకోసం నిర్మించిన సైనిక నిర్మాణాలను తొలగించగానే చైనా చుమార్‌ నుంచి తన సైనిక బలగాలను ఉపసంహరించుకుంది. 

అయితే లదాఖ్‌లో అత్యంత అనుకూలమైన భూభాగాలను కైవసం చేసుకోవడం ద్వారా సరిహద్దులనే మార్చివేసే లక్ష్యంతో చైనా ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు దాని తాజా ఆక్రమణలు సూచిస్తున్నాయి. దీంతో లదాఖ్‌లో చైనా ప్రజా విముక్తి సైన్యానికి సాధికారిక స్థానం లభిస్తుంది. ప్యాంగాంగ్‌ లోని ఫింగర్స్‌ 4, 8 మధ్య భూభాగాల్లో బంకర్లను ఇతర నిర్దిష్ట సైనిక నిర్మాణాలను చేపట్టడం ద్వారా కీలకమైన భూభాగాలను అట్టిపెట్టుకోబోతున్నట్లు చైనా ప్రజావిముక్తి సైన్యం (పీఎల్‌ఏ) సంకేతాలను ఇచ్చింది. లదాఖ్‌ సరిహద్దుకు సమీపంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పీఎల్‌ఏ ఇప్పటికే తిష్టవేసి కూర్చోవడంతో లదాఖ్‌లోని రెండు భారతీయ పార్శా్వలపై ఏకకాలంలో ఒత్తిడి పెంచాలని చైనా భావిస్తోంది.  

చైనా దురాక్రమణ భౌగోళికంగా వ్యూహాత్మక మార్పులకు అది సన్నద్ధమవుతున్నట్లు సూచిస్తోంది. తాను ఆక్రమించిన కీలకమైన ప్రాంతాలను సంఘటితం చేసుకోవడానికి భారత్‌తో సంప్రదింపుల పేరుతో తగిన సమయాన్ని తనకు అనుకూలంగా ఉంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. దురాక్రమణ ద్వారా తగిన మూల్యాన్ని రాబట్టుకుని, చైనా తాను ఆక్రమించిన భూభాగాల నుంచి వైదొలిగినట్లయితే, ఇప్పటినుంచి ఆ ప్రాంతాలు శత్రువును పెద్దగా పట్టించుకోనవసరం లేని కీలక భూభాగాలుగా ఎంతమాత్రం ఉండకపోగా వాటి పరిస్థితి అప్రాధాన్యంగా మారిపోతుంది. 

 మావో జెడాంగ్‌ ఎప్పుడో చెప్పినట్లుగా చైనా సంప్రదింపులను ప్రారంభించిందంటే తన స్థానాన్ని మరింతగా బలపర్చుకోవడం, ప్రత్యర్థి బట్టలు వలిచేయడం కోసమే తప్ప మరొకందుకు కాదు. గత 39 ఏళ్లుగా చైనా విశాలమైన సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి సంప్రదింపులు చేస్తూనే భారత్‌ను సునాయాసంగా ఆరగించగల మల్బరీ పండులాగా మార్చివేసింది. ఇరుదేశాల మధ్య ఇంతవరకు మూడు కీలకమైన చర్చల్లో ఒప్పందాలు కుదిరాయి కానీ, వరుస దురాక్రమణలతో ఈ ఒప్పందాల ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘించడం ద్వారా సరిహద్దు నిర్వహణ వ్యవస్థకు చైనా తూట్లు పొడిచింది.  

ఒక్క బుల్లెట్‌ కూడా పేల్చకుండానే దక్షిణ చైనా సముద్రంపై యధాతథ స్థితిని పూర్తిగా మార్చివేసిన రీతిలో, భారత్‌కు వ్యతిరేకంగా సింగిల్‌ బుల్లెట్‌ కూడా ఉపయోగించకుండానే దురాక్రమణ వ్యూహాలను పూర్తి చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. దీనికోసం భారత్‌ ఎదురుదాడి అవకాశాలపై చర్చలు మొదలెట్టడం లేక చైనా ప్రకటించుకున్న భూభాగాన్ని భారత్‌ ఎత్తుకుపైఎత్తు వేసి ఆక్రమించుకునే అవకాశంపై సంప్రదింపుల పేరుతో భారత్‌ను కట్టడి చేయాలని చైనా చూస్తోంది. అందుకే విభేదాలు వివాదాలకు దారితీయకుండా ఇరుపక్షాలు జాగ్రత్త వహించాలి అని చైనా సుద్దులు పలుకుతోంది. అంటే లదాఖ్‌లో తన దురాక్రమణను భారత్‌ సహించి ఊరుకోవాలి లేకపోతే సరిహద్దుప్రాంతంలో పరిస్థితి చైనాకు అనుకూలంగా అదుపులో ఉంటూ కొనసాగుతుందన్నమాట. 

తాజా దురాక్రమణతో భారత్‌తో తన సంబంధాలను చైనా సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా అనేక అంతర్జాతీయ రంగాలను తెరవడం ద్వారా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తాను జీర్ణం చేసుకోగలిగిన దానికంటే ఎక్కువగా కబళించవచ్చు. అయితే భారత్‌ మేలుకునేటట్లు చేయడం ద్వారా జిన్‌ పింగ్‌ దూకుడు వైఖరి చైనాకు నష్టదాయకంగా పరిణమించవచ్చు. ఇప్పటికే అమెరికాతో చైనా ప్రచ్ఛన్నయుద్ధం మొదలెట్టేసింది. చైనాకు లోబడిపోవడానికి భిన్నంగా, భారత్‌ తన విదేశీ, రక్షణ విధానాలను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బీజింగ్‌ ఆధిపత్య లక్ష్యాలను అడ్డుకోవడం, దానిపై ఆర్థిక భారం మోపడం భారత్‌ విధానాలు కావాలి. చైనాతో తన సైనికపరమైన ప్రతిష్టంభననుంచి భారత్‌ ఎలా బయటపడుతుందనేది తన అంతర్జాతీయ వైఖరి, ఆసియా భద్రత పట్ల కీలకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 

చైనా సామెత ప్రకారం, మీ హృదయంలో ఆకాంక్షను రగల్చడం అంటే మీ చేతితో పులిని మోయడం లాంటిదే. తన నయా సామ్రాజ్యవాద ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడానికి భారత్‌తో ఘర్షణను ప్రారంభించడం ద్వారా షీ జిన్‌ పింగ్‌ తన చేతిని పెద్దపులి నమిలేసే పరిస్థితిని పెంచుకుంటున్నారని చెప్పక తప్పదు. 

-బ్రహ్మచలానీ,భౌగోళిక  రాజకీయ వ్యూహ నిపుణులు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top