
మాధవ్ శింగరాజు
నువ్వు నీ పైనున్న వాడితో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నావంటే, లేదా నీ కింద ఉన్నవాడు నీతో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నాడంటే మీరిద్దరూ కలిసి త్వరలోనే దేనినో నాశనం చేయబోతున్నారనే! లేదా, ఇప్పటికే నాశనం చేసేశారని! అది ఏదైనా కావచ్చు. ఒక పెద్ద సంస్థ. ఒక పెద్ద వ్యవస్థ లేదా, ఒక పెద్ద దేశం.
‘సమ్మతి’ అనేది దాపరికాల నిశ్శబ్దం. అసమ్మతి లేనేలేదని పెద్దగా అరచి చెప్పే అబద్ధం. నేనెప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకున్నది లేదు. నేనెన్నటికీ నా నిష్క్రమణకు సమ్మతంగా ఉండేదీ లేదు.
‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... పార్టీ మిమ్మల్ని తక్షణం తప్పుకోమంటోంది’’ అని పార్టీ కార్యాలయం నుంచి కొందరు వచ్చి చెప్పారు.
‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... చైనా మిమ్మల్ని తక్షణం తప్పుకోమంటోంది’’ అని అధ్యక్ష భవనం నుంచి కొందరు వచ్చి చెప్పారు.
‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... సైన్యం మిమ్మల్ని తక్షణం తప్పుకోమంటోంది’’ అని లిబరేషన్ ఆర్మీ నుంచి కొందరు వచ్చి చెప్పారు.
నన్ను తప్పుకోమంటున్నారంటే – ప్రెసిడెంటు గానో, జనరల్ సెక్రెటరీ గానో, చైర్మన్ గానో తప్పుకోమన్నట్లు కాదు నాకు. ప్రజల్లోంచి తప్పుకోమన్నట్లు. ప్రజల్లో ఉండే మనిషి ప్రజల్లోంచి తప్పుకుని ఎక్కడికి వెళతాడు? ఆ మాటే వారితో అన్నాను.
‘‘మీరు కొన్నాళ్లు ప్రజల్లోంచి అదృశ్యం అయిపోయారు. కొన్నాళ్లుగా మీరు మీ ఆరోగ్యాన్ని ప్రజల నుంచి దాచి పెడుతున్నారు. ఇది కూడా ప్రజల్లో ఉండటమేనా కామ్రేడ్ జిన్‌పింగ్?’’ – అని ఆ వచ్చిన వాళ్లు!
‘‘అదృశ్యమూ కాదు, అనారోగ్యమూ కాదు. ప్రజల గురించి ఆలోచిస్తూ కొంత దూరం నడుచుకుంటూ వెళ్లటమది’’ అన్నాను.
‘‘మీ భాష కూడా మారిపోతోంది కామ్రేడ్ జిన్‌పింగ్. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతోందా?’’ అన్నారు వాళ్లు.
నవ్వాన్నేను.
వాళ్లెవరూ తిరిగి నవ్వేంత తీరికతో వచ్చిన వారు కాదు. నన్ను తప్పించిపోదామని వచ్చినవాళ్లు.
‘‘డియర్ కామ్రేడ్స్, నేను వెళ్లానే గానీ, ఒంటరిగా వెళ్లలేదు. నాతో మరో ఇద్దరు కలిసి నడిచారు. ఆ ఇద్దరిలో ఒకరు చైనా రిపబ్లిక్ అధ్యక్షుడు కామ్రేడ్ జిన్‌పింగ్. మరొకరు ఆర్మీ చైర్మన్ కామ్రేడ్ జిన్‌పింగ్. ఇక నేను పార్టీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ జిన్‌పింగ్. నేనొక్కడినే ముగ్గురు కామ్రేడ్‌లుగా వెళ్లి, నాలోని ఆ ఇద్దరు కామ్రేడ్‌లలో ఒకరి నుంచి మంచిని ఎంచుకున్నాను. మరొకరిని చూసి నన్ను నేను సవరించుకున్నాను’’ అని చెప్పాను.
అప్పుడు నవ్వారు వాళ్లు!
‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... దశాబ్దాల క్రితమే కన్ఫ్యూషియస్‌ను చైనా వదిలేసింది. మీరింకా ఆయన్ని పట్టుకునే ఉన్నారు!’’ అన్నారు.
‘‘ఎవరైనా ఇద్దరితో కలిసి నడుస్తున్నప్పుడు ఆ ఇద్దరినీ నేను నా గురువులుగా భావిస్తాను... ఒకరిని మంచి కోసం, ఇంకొకరిని వారిలోని చెడును చూసి నన్ను నేను మార్చుకోవటం కోసం...’’ అని కన్ఫ్యూషియస్ చెప్పిన మాట వారికీ గుర్తుందంటే వారూ కన్ఫ్యూషియస్‌ను వదల్లేదనే కదా!
‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... మిమ్మల్ని లి–రుయిహువాన్, వెన్ జియాబావో వంటి పదవీ విరమణ పొందిన పార్టీ పెద్దలు సమ్మతించటం లేదు. విదేశాలలో స్థిరపడిన చైనా వారసత్వ యువరాజులు సమ్మతించటం లేదు. జాంగ్ యూషియా వంటి సైనిక నాయకులు సమ్మతించటం లేదు. మధ్యతరగతి ప్రజలు, వ్యాపారాలు చేసుకునే వారు సమ్మతించటం లేదు. ఇక మీరేమో సమష్టి నాయకత్వాన్ని సమ్మతించటం లేదు. చెప్పండి కామ్రేడ్ ఏం చేద్దాం?’’ అన్నారు వాళ్లు.
ఏదైనా చేయాల్సిన అవసరం ఏముంది?!
చైనా బలమే అసమ్మతి. చైనాకు ఉన్న మరొక బలం ఆ అసమ్మతికి తలొగ్గని నాయకత్వం. ప్రజల సమ్మతి కోసమే ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఎల్లప్పుడూ తన పైకి తను సకల అసమ్మతులను తలెత్తనివ్వనిస్తుంది.