
బీజింగ్: చైనా తయారు చేసిన కొత్త బాలిస్టిక్ క్షిపణులు అమెరికా భద్రతా వ్యవస్థకు సవాల్ విసరడమే కాకుండా భారత్, జపాన్‌లోని మిలిటరీ క్యాంపులను లక్ష్యంగా చేసుకోగలవని తెలుస్తోంది. గతేడాది చివర్లో ‘హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ)’లేదా డీఎఫ్–17 అనే క్షిపణిని చైనా పరీక్షించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక ఓ కథనంలో పేర్కొంది. చైనా ఆర్మీకి చెందిన రాకెట్ బలగాలు నవంబర్ 1న ఓ పరీక్ష, రెండు వారాల తర్వాత రెండో పరీక్ష నిర్వహించాయని వెల్లడించింది. ‘అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం రెండు పరీక్షలు విజయవంతమయ్యాయి’అని ప్రచురించింది. కాగా, ఈ పరీక్షలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిని వివరణ అడగగా ఆ వార్తలను ఖండించారు.