బ్రెగ్జిట్‌ ఆలస్యానికే ఓటు

Brexit vote setback for Boris Johnson in Parliament - Sakshi

బ్రిటన్‌ పార్లమెంట్‌ నిర్ణయం

ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఎదురుదెబ్బ

గడువుకే కట్టుబడతామని జాన్సన్‌ స్పష్టీకరణ

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందం జాప్యం కానుంది. ఈ మేరకు శనివారం జరిగిన చారిత్రక సమావేశం నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్‌ కోసం ఈయూతో కుదుర్చుకున్న గొప్ప ఒప్పందానికి మద్దతు తెలపాలంటూ ఈ అంశంపై ప్రధాని జాన్సన్‌ పార్లమెంట్‌లో చర్చను ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రెగ్జిట్‌ తర్వాత అవసరమయ్యే చట్టాలు రూపొందనందున ఈ గడువును 31వ తేదీ నుంచి  పొడిగించాలని శనివారం అర్థరాత్రిలోగా ఈయూను కోరాలంటూ కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ ఆలివర్‌ లెట్విన్‌ సవరణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానానికి అనుకూలంగా 322 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 306 ఎంపీలు ఓట్లేశారు.

ప్రధాని కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఎంపీల మద్దతు లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని లేబర్‌ పార్టీ నేత కార్బైన్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని జాన్సన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఓటింగ్‌ అర్థరహితం. అక్టోబర్‌ ఆఖరు కల్లా బ్రెగ్జిట్‌ అమలు చేయాలన్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, తాజా ఓటింగ్‌ మేరకు ఈయూను గడువు పొడిగించాలని కోరబోను’అని స్పష్టం చేయడం గమనార్హం. బ్రెగ్జిట్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వచ్చే సోమవారం సభలో ప్రవేశపెట్టి, మంగళవారం ఓటింగ్‌కు కోరతామన్నారు. కాగా, పార్లమెంట్‌లో చర్చ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రధాని జాన్సన్‌ ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, శనివారం జరిగిన ‘ప్రతినిధుల సభ’ సమావేశాన్ని విశ్లేషకులు ‘సూపర్‌ సాటర్‌డే సెషన్‌’అని అంటున్నారు. ఇలాంటి అసాధారణ సమావేశం 1982లో మార్గరెట్‌ థాచర్‌ ప్రధానిగా ఉండగా ఫాక్‌ల్యాండ్‌ యుద్ధంపై ఓటింగ్‌ కోసం ఏర్పాటైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top