‘మనోడు’ మాట వినలేదు.. శిక్ష తప్పలేదు

Breaching Stay Home Notices Indian Origin In Singapore Sentenced - Sakshi

సింగపూర్‌: కరోనా నియంత్రణ చర్యలు పాటించని భారతీయ పౌరుడికి సింగపూర్‌లోని ఓ కోర్టు ఆరు వారాల జైలు శిక్ష విధించింది. ‘స్టే హోమ్‌’ నోటీసులు ఉల్లంఘించి ఇతరులను ప్రాణాలకు రిస్కులో పెట్టినందుకు ఈ శిక్ష వేసింది. సింగపూర్‌లో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఖురేష్‌ సింగ్‌ సంధూ మార్చి నెలలో ఇండోనేషియా వెళ్లి వచ్చాడు. దాంతో, మార్చి 17 నుంచి 31 వరకు ఇంటి వద్దే ఉండాలని స్థానిక యంత్రాంగం అతనికి నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులు బేఖాతరు చేసిన సంధూ యథావిధిగా విధులకు హాజరయ్యాడు. సహోద్యోగులతో మునుపటి మాదిరే రూమ్‌ షేర్‌ చేసుకున్నాడు. 

అలా మూడు రోజులపాటు డ్యూటీ చేశాడు. ఈక్రమంలో మార్చి 21న సంధూ పనిచేసే సెక్యురిటీ కంపెనీ సూపర్‌వైజర్‌కు అతనికి స్టే హోమ్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. దాంతో ఇంటికి వెళ్లిపోయవాలని అతను సంధూకు హుకుం జారీ చేశాడు. అదేక్రమంలో ఇమిగ్రేషన్‌, చెక్‌పాయింట్‌ అధికారులు సంధూ నోటీసులు ఉల్లంఘించి, బయట తిరుగుతున్నాడని గ్రహించారు. అదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. కాగా, సింగపూర్‌లో ఇప్పటివరకు 32, 876 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో చాలామంది విదేశీయులే కావడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top