సీమాంతర ఉగ్రవాదాన్ని సహించం

"America First And Make In India Not Incompatible," Says US Ambassador - Sakshi

భారత్‌లో అమెరికా రాయబారి జస్టర్‌

హిందూ–పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో ‘భారత్‌ ప్రధాన శక్తి’ అని వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్‌ను హిందూ–పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో ‘ప్రధాన శక్తి’గా అమెరికా పరిగణిస్తోందని భారత్‌లో ఆ దేశ రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ పేర్కొన్నారు. అమెరికా వ్యాపార రంగానికి భారత్‌ ఓ కీలకమైన వాణిజ్య శక్తి అని అభివర్ణించారు. నవంబర్‌లో భారత రాయబారిగా జస్టర్‌ బాధ్యతలు తీసుకున్నప్పటికీ గురువారం తొలిసారిగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారత్‌పై అమెరికా విధానం గురించి కెన్నెత్‌ వివరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అమెరికా ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రసంగంలో ఎక్కడా పాకిస్తాన్‌ పేరును ప్రస్తావించలేదు.

ఇటీవల పాకిస్తాన్‌కు అమెరికా ఇచ్చే సాయాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. అమెరికాకు సంబంధించి సున్నితమైన సాంకేతికత బదిలీ విషయంలో మొదట్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్న సంగతి నిజమేనని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధానమైన 4 ఎగుమతుల నియంత్రణ గ్రూపుల్లో భారత్‌ ఇప్పటికే రెండింటిలో (వాసెనార్, క్షిపణి సాంకేతికత నియంత్రణ గ్రూప్స్‌) సభ్యత్వం పొందిందని గుర్తు చేశారు. అలాగే ఆస్ట్రేలియా గ్రూప్‌ ఆన్‌ కెమికల్, బయలాజికల్‌ వెపన్స్‌ గ్రూపులో త్వరలోనే భారత్‌ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అణు సరఫరాదారుల గ్రూపులో భారత్‌ సభ్యత్వం విషయంలో కూడా అమెరికా చాలా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
► ఇంటెలిజెన్స్, నిఘా, యుద్ధ విమానాల తయారీలో ఇరుదేశాలకు భారీ ఒప్పందాలు జరగనున్నాయి.
► భారత్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌తో వాణిజ్యలోటు ఆందోళనకరమే.
► చైనాలో వ్యాపార నిర్వహణకు చాలా అమెరికన్‌ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సంస్థలన్నీ ఆశగా ప్రత్యామ్నాయ వేదికలకోసం వెతుకుతున్నాయి.
► అమెరికా వ్యాపారాల నిర్వహణకు అసలైన ప్రాంతీయ కేంద్రం భారత్‌.
► రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక రంగాల్లో దీర్ఘకాల సుస్థిర బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి.
► వలసవాదుల దేశంగానే అమెరికా ఉండబోతోంది.
► భారత్, అమెరికా దేశాలు ఉగ్రబాధితులు. అందుకే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top