
హాంకాంగ్ : యుద్ధాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బాంబులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏళ్ల తర్వాత బయటపడుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హాంకాంగ్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. వెయ్యి పౌండ్ల బరువు ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలానికి చెందిన ఓ బాంబును హాంకాంగ్‌లో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాల వీధిలో గుర్తించారు. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దానిని పేలకుండా బయటకు తీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. దీనిపై హాంకాంగ్ పోలీసులు వివరాలు చెబుతూ గడిచిన వారంలోనే ఇది రెండో బాంబు అని చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో పలు ప్రాంతాల్లో భూమిలోపల బాంబులు పేలకుండా పడిపోయి ఉన్న విషయం తెలిసిందే. ఏదైనా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు జరిపే తవ్వకాల్లో ఇవీ అనూహ్యంగా బయటపడుతున్నాయి. తాజాగా బయటపడిన బాంబు అమెరికా తయారు చేసిన ఏఎన్-ఎం65 బాంబు అని, ప్రస్తుతం అది బయటపడిన చోటు ఒకప్పుడు జపాన్ ఆదీనంలో ఉండేదని అధికారులు చెప్పారు. దాదాపు 4000 మందిని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించి రాత్రికి రాత్రి తీవ్రంగా శ్రమించి ఆ బాంబు నిర్వీర్యం చేశారు.