మండల కమిటీలకు లబ్ధిదారుల బాధ్యత! | Zone Committees are responsible for the beneficiaries! | Sakshi
Sakshi News home page

మండల కమిటీలకు లబ్ధిదారుల బాధ్యత!

Apr 19 2016 1:23 AM | Updated on Aug 14 2018 2:13 PM

ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి మండల క మిటీలకు అప్పగించాలని రాష్ట్ర మంత్రివర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.

♦ మంత్రులకు సీఎం ర్యాంకుల ప్రకటన
♦ పీతల ఫస్ట్, నారాయణ లాస్ట్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి మండల క మిటీలకు అప్పగించాలని రాష్ట్ర మంత్రివర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సూత్రప్రాయం గా నిర్ణయించింది. అయితే దీనిపై మరోమారు చర్చిం చిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ భేటీతో పాటు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సమన్వయ కమిటీ సమావేశంలో జన్మభూమి కమిటీలపై చర్చించారు. టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచే అంశంపై చర్చ జరిగినా.. నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ మహానాడును తిరుపతి, విజయవాడల్లో ఎక్కడ నిర్వహించాలో పార్టీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకోనున్నారు.  

 మంత్రులకు ర్యాంకులు: పార్టీ పటిష్టతకు చేసిన కృషి, శాఖల సమీక్షలు, జిల్లాల పర్యటన అంశాల ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ర్యాంకులు ప్రకటించారు. గనుల శాఖ మంత్రి పీతల సుజాత తొలి ర్యాంకు సాధించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణకు 18వ ర్యాంకు వచ్చింది. సమావేశంలో పాల్గొ న్న వారి సమాచారం మేరకు మంత్రుల ర్యాంకుల వివరాలు.... దేవినేని ఉమామహేశ్వరరావు(2వ ర్యాంకు), ప్రత్తిపాటి పుల్లారావు (3), కామినేని శ్రీనివాసరావు (4), పరిటాల సునీత (5), రావెల కిషోర్ బాబు (6), కె.అచ్చన్నాయుడు (7), గంటా శ్రీనివాసరావు (8), కొల్లు రవీంద్ర (9),సీహెచ్. అయ్యన్నపాత్రుడు (10), పల్లె రఘునాథరెడ్డి (11), పైడికొండల మాణిక్యాలరావు (12), కిమిడి మృణాళిని (13) ర్యాంకులు సాధించారు.

అయితే ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావుల ర్యాంకులు బయటకు రాలేదు. ఇక ఎమ్మెల్యేల్లో  తూ.గో జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రథమ స్థానం, విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ద్వితీయ, చంద్రబాబు 76వ స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. టీడీపీ జిల్లా అధ్యక్షుల్లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు నాయుడు తొలి ర్యాంకు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement