ranks to the ministers
-
మండల కమిటీలకు లబ్ధిదారుల బాధ్యత!
♦ మంత్రులకు సీఎం ర్యాంకుల ప్రకటన ♦ పీతల ఫస్ట్, నారాయణ లాస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి మండల క మిటీలకు అప్పగించాలని రాష్ట్ర మంత్రివర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సూత్రప్రాయం గా నిర్ణయించింది. అయితే దీనిపై మరోమారు చర్చిం చిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ భేటీతో పాటు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సమన్వయ కమిటీ సమావేశంలో జన్మభూమి కమిటీలపై చర్చించారు. టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచే అంశంపై చర్చ జరిగినా.. నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ మహానాడును తిరుపతి, విజయవాడల్లో ఎక్కడ నిర్వహించాలో పార్టీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రులకు ర్యాంకులు: పార్టీ పటిష్టతకు చేసిన కృషి, శాఖల సమీక్షలు, జిల్లాల పర్యటన అంశాల ఆధారంగా కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ర్యాంకులు ప్రకటించారు. గనుల శాఖ మంత్రి పీతల సుజాత తొలి ర్యాంకు సాధించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణకు 18వ ర్యాంకు వచ్చింది. సమావేశంలో పాల్గొ న్న వారి సమాచారం మేరకు మంత్రుల ర్యాంకుల వివరాలు.... దేవినేని ఉమామహేశ్వరరావు(2వ ర్యాంకు), ప్రత్తిపాటి పుల్లారావు (3), కామినేని శ్రీనివాసరావు (4), పరిటాల సునీత (5), రావెల కిషోర్ బాబు (6), కె.అచ్చన్నాయుడు (7), గంటా శ్రీనివాసరావు (8), కొల్లు రవీంద్ర (9),సీహెచ్. అయ్యన్నపాత్రుడు (10), పల్లె రఘునాథరెడ్డి (11), పైడికొండల మాణిక్యాలరావు (12), కిమిడి మృణాళిని (13) ర్యాంకులు సాధించారు. అయితే ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావుల ర్యాంకులు బయటకు రాలేదు. ఇక ఎమ్మెల్యేల్లో తూ.గో జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రథమ స్థానం, విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ద్వితీయ, చంద్రబాబు 76వ స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. టీడీపీ జిల్లా అధ్యక్షుల్లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు నాయుడు తొలి ర్యాంకు సాధించారు. -
మంత్రుల ర్యాంకుల్లో 'మ్యాచ్ ఫిక్సింగ్'!?
హైదరాబాద్: మంత్రుల పనితీరును బేరీజు వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కో మంత్రికి ర్యాంకుల కేటాయించడంలోనూ రాజకీయాలు జొప్పించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత మంత్రులను కొందరిని వెనక్కి తోసి పనిలేని శాఖలకు చెందిన మంత్రులు బాగా పనిచేస్తున్నారంటూ కితాబివ్వడం కేబినేట్ సహచరుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. విజయవాడలో సోమవారం సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో చంద్రబాబునాయుడు ఆయా మంత్రుల పనితీరును విశ్లేషించారు. వివిధ అంశాల ప్రాతిపదికగా పనితీరును విశ్లేషించి మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు. ఈ ర్యాంకులు ఇచ్చిన తీరుపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వాటిలోనూ రాజకీయం చేసి తమ పరువు తీస్తున్నారని కొందరు సీనియర్ మంత్రులు మండిపడుతున్నారు. ర్యాంకులు ఇవ్వడంలోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ర్యాంకుల్లో వెనుకబడిన మంత్రులు కొందరు అంటున్నారు. సమావేశంలో ఒక్కొక్క మంత్రి పనితీరును విశ్లేషిస్తూ మొత్తం 19 మంది మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి (రెవెన్యూ), నిమ్మకాయల చినరాజప్ప (హోం శాఖ)... యనమల రామకృష్ణుడు (ఆర్థిక), పీ నారాయణ (మున్సిపల్ వ్యవహారాలు), సిద్దా రాఘవరావు (రవాణా) ర్యాంకుల్లో చాలా వెనుకబడిపోయారు. అలాగే మంత్రులు అయ్యన్న పాత్రుడు (పంచాయతీ రాజ్), మృణాళిని (హౌసింగ్), పైడికొండల మాణిక్యాలరావు (దేవాదాయ), బొజ్జల గోపాల కృష్ణారెడ్డి (అటవీ) తదితరుల పనితీరు కూడా సరిగా లేదనే వారికిచ్చిన ర్యాంకులను బట్టి అర్థమవుతోంది. మంత్రివర్గంలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తున్నారంటూ పీతల సుజాత (మహిళా సంక్షేమం, మైనింగ్)కు మొదటి ర్యాంకు ఇచ్చారు. రెండో స్థానంలో దేవినేని ఉమామహేశ్వరరావు (నీటిపారుదల), ఆ తర్వాత వరుసగా పత్తిపాటి పుల్లారావు (వ్యవసాయం), కామినేని శ్రీనివాసరావు (వైద్యం), పరిటాల సునీత (పౌర సరఫరాలు), రావెల కిషోర్ బాబు (సాంఘిక సంక్షేమం), అచ్చెన్నాయుడు (కార్మిక), గంటా శ్రీనివాసరావు (మానవ వనరులు), కొల్లు రవీంద్ర (వెనుకబడిన తరగతులు), పల్లె రఘునాధరెడ్డి (సమాచార) ముందు వరుసలో నిలిచారు. కీలక శాఖలు నిర్వర్తిస్తున్న సీనియర్ మంత్రుల పనితీరు బాగా లేదని చెబుతున్నప్పుడు వాళ్ల శాఖలను మార్చొచ్చని, అలా చేయకుండా ప్రతి కేబినెట్ సమావేశంలో ఈ ర్యాంకుల ప్రక్రియ ఏంటని కొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని శాఖల్లో అసలు ఏమాత్రం పనిలేదని, అలాంటి శాఖలకు చెందిన మంత్రులకు మొదటి ర్యాంకులు ఎలా వస్తాయని సీనియర్ మంత్రి ఒకరు తప్పుబట్టారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రులు సైతం చివరిస్థానంలో నిలిచినట్టు ర్యాంకులు ఇచ్చారని, పనితీరును విశ్లేషించడంలో సీఎం సన్నిహితులను కూడా వదలరన్న భావన కల్పించడానికి ఇలాంటి జిమ్మక్కులు చేయాల్సిన అవసరం లేదని అసంతృప్తి వెల్లగక్కారు. ఒక్కో శాఖలో ఒక్కో తీరు పని ఉంటుందని, అలాంటప్పుడు ఈ రకంగా ర్యాంకులిచ్చి తామోదో పనిచేయడం లేదన్న అభిప్రాయం కల్పించడం సీనియర్లను అవమానించడమేనని తన సన్నిహితుల వద్ద మరో సీనియర్ నేత అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తుంటారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించిన భూ సమీకరణ బాధ్యతతోపాటు సింగపూర్ సంస్థలతో ఒప్పందాల వంటి అనేక కీలకమైన అంశాలను.. రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న కేఈ కృష్ణమూర్తికి కాకుండా మంత్రి నారాయణకు అప్పగించిన విషయం తెలిసిందే. ఎంతో నమ్మకస్తుడైన నారాయణ పనితీరులో చివరన ఉన్నారని ప్రకటించడమంటే మ్యాచ్ ఫిక్సింగ్ కాక మరేంటని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, కేబినెట్ సమిష్టిగా పనిచేసి ప్రజల అవసరాలను తీర్చాల్సిన సమయంలో ర్యాంకుల పేరుతో సమావేశాల్లో గంటల తరబడి సమయం వెచ్చించడం ఇప్పటికైనా స్వస్తి పలికితే మంచిదని ఆ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.


