గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిథున్రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్ : గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిథున్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్లో పి.మిథున్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి... ఆ పార్టీనే విమర్శించడం ఎంత వరకు సమంజసం అని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆయన ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే పార్టీ మారామని అంటున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగింది... ఎక్కడ జరిగిందని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మిథున్రెడ్డి ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యే సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే... టీడీపీని మూసేసుకుంటారా? అని ఆ పార్టీ నేతలకు మిథున్రెడ్డి సవాల్ విసిరారు.
అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి సమక్షంలో చిత్తూరు జిల్లా బైరెడ్డి పాలెం ఎంపీపీ విమల చేరారు. తన ప్రమేయం లేకుండానే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి.. బలవంతంగా టీడీపీ కండువా కప్పారని ఆమె ఆరోపించారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని... ఆ పార్టీలోనే కొనసాగుతానని ఎంపీపీ విమల స్పష్టం చేశారు.