మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు.
కుత్భుల్లాపూర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ సంఘటన కుత్భుల్లాపూర్ పరిధిలోని ద్వారకానగర్‌లో నిన్న(గురువారం) మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆలస్యంగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ద్వారకానగర్‌లో నివాసముంటున్న పద్మారావు, సుశీల(40) దంపతులు. స్థానికంగా ఉంటూ కూలీ పనిచేసి జీవిస్తున్నారు. పద్మారావు నిత్యం మద్యం తాగుతూ భార్యను డబ్బుల కోసం వేధిస్తుండేవాడు.
ఇదే క్రమంలో నిన్న మధ్యాహ్నం పద్మారావు తాగేందుకు డబ్బులు లేకపోవడంతో భార్యను అడిగాడు. మద్యానికైతే డబ్బులు ఇవ్వనని ఆమె తేల్చి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన పద్మారావు, సుశీల తలను నేలకేసి బాదాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో నిన్న రాత్రి లొంగిపోయాడు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటలకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. మద్యం మత్తులో ఉండి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. మత్తు దిగిన తర్వాత హత్య ఎక్కడో చేశాడో చెప్పడంతో పోలీసులు సంఘటనాస్థలానికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
wife murdered by husband