నీళ్లు లేని స్కూళ్లు | water promblems in schools | Sakshi
Sakshi News home page

నీళ్లు లేని స్కూళ్లు

Jul 23 2014 1:57 AM | Updated on Sep 4 2018 5:07 PM

నీళ్లు లేని స్కూళ్లు - Sakshi

నీళ్లు లేని స్కూళ్లు

విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలన్న ప్రభుత్వ ఆకాంక్ష ఓవైపు ఉంటే. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీటి వసతి కూడా లేని దయనీయ పరిస్థితులున్నాయి.

 సాక్షి, హైదరాబాద్:
 విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలన్న ప్రభుత్వ ఆకాంక్ష ఓవైపు ఉంటే. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీటి వసతి కూడా లేని దయనీయ పరిస్థితులున్నాయి.  ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు(తాగునీరు, మరుగుదొడ్లు..) కల్పించాలని ఇటీవల సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కదిలిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం పాఠశాలల వారీగా ప్రస్తుతం ఉన్న వసతులపై నివేదిక రూపొందించింది. హైదరాబాద్ జిల్లాలోని 176 ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం లేదని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
 బడులు మానేస్తున్నారు: జిల్లాలో 802 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 350 పాఠశాలలు సొంత భవనాల్లేక అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అద్దెకు భవనాలు కూడా దొరక్క విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న(రెండు, మూడు) పాఠశాలలను కలిపి ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. 543 ప్రాంగణాల్లో ప్రాథమిక పాఠశాలలు, 206 ప్రాంగణాల్లో హైస్కూళ్లు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో 1,32,177 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 70,308 మంది బాలికలు, 61,869 మంది బాలురు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. ఒకవేళ మరుగుదొడ్ల సదుపాయం ఉన్నా.. కొన్ని పాఠశాలల్లో నీటి వసతి లేక అవి నిరుపయోగంగా మారాయి. నీటి సదుపాయం ఉన్న పాఠశాలల్లో నిర్వహణ లోపంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి విద్యార్థులు, టీచర్లు ఇంటి బాట పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బాలికలు బడికి రావడం మానేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement