తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలి! | venkaiah naidu praises kcr on telugu language | Sakshi
Sakshi News home page

తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలి!

Sep 17 2017 8:24 PM | Updated on Sep 19 2017 4:41 PM

తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలి!

తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలి!

అక్కినేని పురస్కారం రాజమౌళికి బరువు కాదు బాధ్యత అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

  • కేసీఆర్ భాషాభిమాని
  • తెలుగు భాష తప్పనిసరి అభినందనీయం
  • అక్కినేని పురస్కారం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • సాక్షి, హైదరాబాద్‌: అక్కినేని పురస్కారం రాజమౌళికి బరువు కాదు బాధ్యత అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అక్కినేని జాతీయ పురస్కారం ఆలోచన మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. సినీ దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని ఏడు అద్భుతాలను మహాద్భుతంగా చూపించేది సినిమా అని, అక్కినేని జాతీయ పురస్కారం రాజమౌళికి ఇవ్వడం సముచితమని అన్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఈరోజు అపూర్వమైన రోజు అని కొనియాడారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోందని, నాటి రాజా హరిశ్చంద్ర నుంచి నేటి బాహుబలి వరకు ఎంతో గుణాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు.

    గతానికి, వర్తమానానికి వారధిగా నిలుస్తున్న భారతీయ సినిమా ఘనత మాటల్లో చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను తప్పనిసరి చేయడం అభినందనీయమని అన్నారు. తెలుగు భాషకు ప్రాణం పోసేది సాహిత్యం, సంగీతం, సినిమా అని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సహం లేకపోతే భాష బతకదన్నారు. రాష్ట్రాలు మాతృభాషను ప్రోత్సహించాలని సూచించారు. తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలనే నిబంధన పెట్టాలని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ భాషాభిమాని అని వెంకయ్యనాయుడు కొనియాడారు. మాతృభాష కళ్లలాంటిదదని, పరాయి భాష కళ్లద్దాల్లాంటిదని చమత్కరించారు.

    భారతీయ సినిమాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతులిచ్చామని, మల్టీఫ్లెక్స్ సంస్కృతి సినిమా తీరు తెన్నులను మారుస్తోందని చెప్పారు. సినిమా నిత్య జీవితంలో భాగమైపోయిందన్నారు. ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫి చట్టానికి విరుద్ధంగా సినిమాల రూపకల్పన జరుగుతోందని, ప్రస్తుతం కొన్ని సినిమాల్లోని కథ, కథనాలు ప్రశ్నార్థకరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంపై పెనుప్రభావం చూపే సినిమా ప్రజాహితంగా ఉండాలని,  సినిమాలు వినోదం కోసమే కాదు చైతన్యం కోసం నిర్మించాలని వెంకయ్య దర్శకనిర్మాతలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement