కేంద్రం ఎఫ్ఆర్బీఎం కింద రుణ పరిమితిని పెంచినందున... తెలంగాణ రాష్ట్రంలోని రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కేసీఆర్ సర్కార్ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : కేంద్రం ఎఫ్ఆర్బీఎం కింద రుణ పరిమితిని పెంచినందున... తెలంగాణ రాష్ట్రంలోని రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కేసీఆర్ సర్కార్ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, మాజీమంత్రులు టి.జీవన్ రెడ్డి, డి.శ్రీధర్‌బాబుతో కలిసి గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
కరువు తీవ్రత వల్ల భూగర్భజలాలు అడుగంటి, పంటలన్నీ ఎండిపోయాయని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, పశుగ్రాసం లేక పశువులను అమ్ముకుంటున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచిందన్నారు. దీనివల్ల రాష్ట్ర జీడీపీలో 3.5 శాతం రుణం తీసుకునే అవకాశం పెరిగిందని, అదనంగా 3 వేల కోట్లకు పైగా అదనంగా ప్రయోజనం ఉంటుందని వివరించారు.
ఈ నిధులన్నీ రుణమాఫీని అమలుచేసి, కరువు తీవ్రత వల్ల కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని రుణ విముక్తులను చేయడానికి ఉపయోగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుచేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్కు ఎంపీ కవిత వస్తామన్నారని ఉత్తమ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ మా ప్రజంటేషన్ చూడాల్సింది మాత్రం సీఎం కేసీఆర్, ఆయన మంత్రి వర్గం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


