అభ్యర్థులకే మార్కుల జాబితాలు

Tspsc exercise on jobs process - Sakshi

ఆన్‌లైన్‌లో అందించేలా ఏర్పాట్లు

ఉద్యోగ పరీక్షలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉద్యోగం రాకపోయినా తమకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే వారికి వచ్చిన మార్కుల మెమోను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 20 నాటికి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే నియామకాల ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులందరికీ ఈ అవకాశాన్ని అందుబాటులోకి తేనుంది. మరోవైపు నియామకాల ప్రక్రియ పూర్తయ్యాక పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలు, మార్కుల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు గతంలోనే చర్యలు చేపట్టింది.

మరో మూడు నెలల్లో టీఎస్‌పీఎస్సీ టార్గెట్‌ పూర్తి: విఠల్‌
వచ్చే మూడు నెలల్లో తమ టార్గెట్‌ పూర్తవుతుందని టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సి.విఠల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆయా శాఖలు ఇచ్చిన పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు 35 వేల పోస్టుల భర్తీ బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి అప్పగించిందన్నారు.

అందులో 30,619 పోస్టుల భర్తీకి 109 రకాల నోటిఫికేషన్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అందులో 11,333 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మిగిలిన 18,715 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. అవన్నీ వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తవుతాయన్నారు. మరో 571 పోస్టుల నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా 4,375 పోస్టులకు సంబంధించి ఆయా శాఖలు ఇండెంట్లు ఇవ్వలేదని, అవి వస్తే వాటికీ నోటిఫికేషన్లు జారీ చేస్తామని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top