
కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతల కన్నెర్ర
రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. ప్రపంచమంతా కేసీఆర్ ను కీర్తిస్తుంటే ఆయన మాత్రం తప్పుబడుతున్నారని ఢిల్లీలో అన్నారు. కోదండరామ్ కుబుసం విడిచిన పాము అని వర్ణించారు.
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఉనికిలోనే లేదని, కోదండరామ్ దేనిక చైర్మనో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరికి వారు విడిపోయారని గుర్తు చేశారు. చేతకాకుంటే తప్పుకోవాలన్న వ్యాఖ్యాలను కోదండరామ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలే ఇస్తారని చెప్పారు. తమతో కలిసి రావాలని కోరినా కోదండరామ్ రాలేదన్నారు. జేఏసీ ముసుగులో ప్రభుత్వంపై దాడిని ఖండిస్తున్నామన్నారు. కోదండరాం వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.