
అంతు చూస్తామంటూ నిర్మాతకు బెదిరింపులు
ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్‌మెంట్ చేసుకోకపోతే అంతుచూస్తామంటూ ఓ నిర్మాతను బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్‌మెంట్ చేసుకోకపోతే అంతుచూస్తామంటూ ఓ నిర్మాతను బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ సమీపంలోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత కె.ఎల్.దామోదర్‌ప్రసాద్‌కు ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఫోన్ కాల్ రాగా ఆయన ఎత్తలేదు. మరో రెండుసార్లు కూడా పని ఒత్తిడిలో లిఫ్ట్ చేయలేకపోయాడు. నాలుగో సారి అదే నెంబర్‌తో మళ్లీ ఫోన్ వచ్చింది. ఎవరు మీరంటూ ప్రశ్నిస్తుండగానే అవతలి వ్యక్తి పెద్దగా కేకలు వేస్తూ అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. అంతుచూస్తానంటూ బెదిరించాడు.
తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్‌కు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని లేకపోతే అంతుచూస్తామంటూ హెచ్చరించాడు. తాను ఎవరికీ డబ్బుల ఇచ్చేది లేదని రామకృష్ణగౌడ్‌తో ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌లో పరిచయం మాత్రమే ఉందని చెప్పగా తనపేరు నిఖిల్ రస్తోగీ అని ఎక్కువ మాట్లాడితే బావుండదని మరోమారు బెదిరించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ దామోదర్‌ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 507 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.