Ramakrishna Goud
-
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
అంతు చూస్తామంటూ నిర్మాతకు బెదిరింపులు
హైదరాబాద్: ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్మెంట్ చేసుకోకపోతే అంతుచూస్తామంటూ ఓ నిర్మాతను బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ సమీపంలోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత కె.ఎల్.దామోదర్ప్రసాద్కు ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఫోన్ కాల్ రాగా ఆయన ఎత్తలేదు. మరో రెండుసార్లు కూడా పని ఒత్తిడిలో లిఫ్ట్ చేయలేకపోయాడు. నాలుగో సారి అదే నెంబర్‌తో మళ్లీ ఫోన్ వచ్చింది. ఎవరు మీరంటూ ప్రశ్నిస్తుండగానే అవతలి వ్యక్తి పెద్దగా కేకలు వేస్తూ అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. అంతుచూస్తానంటూ బెదిరించాడు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్‌కు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని లేకపోతే అంతుచూస్తామంటూ హెచ్చరించాడు. తాను ఎవరికీ డబ్బుల ఇచ్చేది లేదని రామకృష్ణగౌడ్‌తో ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌లో పరిచయం మాత్రమే ఉందని చెప్పగా తనపేరు నిఖిల్ రస్తోగీ అని ఎక్కువ మాట్లాడితే బావుండదని మరోమారు బెదిరించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ దామోదర్‌ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 507 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం
థియేటర్ల లీజు విధానంపై నిరసన వ్యక్తం చేస్తూ... దాన్ని రద్దు చేయాలని కోరుతూ గత వారం రోజులుగా హైదరాబాద్‌లోనిచలనచిత్ర వాణిజ్య మండలి ఎదుట తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మద్దతుదారులు ఫిలించాంబర్‌పై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి, భువనగిరి ఎంపీ బూర నరసయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహీందర్‌రెడ్డి శిబిరం వద్దకు చేరి ప్రతాని రామకృష్ణగౌడ్‌కి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తదనంతరం ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ- ‘‘చిన్న సినిమాల సంక్షేమం కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన ప్రతాని రామకృష్ణగౌడ్‌కి కొందరు సంఘీభావం తెలుపకపోవడం బాధాకరం. లీజు విధానం వల్ల చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విన్నవిస్తాం. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుంది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ -‘‘లీజు విధాన్ని ప్రవేశపెట్టింది నిర్మాత డి.సురేశ్‌బాబు. ఆయనతో పాటు మరో ముగ్గురు, వారి అనుచరులు... ఇలా చాలామంది బినామీల కింద రెండు రాష్ట్రాల్లో థియేటర్లున్నాయి. థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించి సినిమాలను ఆడిస్తున్నారు. అలాగే... ఫిలించాంబర్ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం తరఫున ఓ ప్రతినిథిని నియమించి ఎన్నికలు సక్రమంగా జరిపించాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నాం’’ అని చెప్పారు. -
ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
-
ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్‌ను ముట్టడించేందుకు నిర్మాత రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు యత్నించారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. చిన్న సినిమాల పాలిట శాపంగా మారిన థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రామకృష్ణ గౌడ్ శనివారం నుంచి ఫిలిం చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీక్షపై ఎవరూ స్పందించకపోవటంతో రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లీజు విధానాన్ని ఎత్తివేయాలి!
‘‘చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది. తక్షణమే థియేటర్ల లీజు విధానాన్ని ఎత్తివేయాలి’’ అని తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. శనివారం మొదలుపెట్టి గత మూడు రోజులుగా పలువురు చిన్న చిత్రాల నిర్మాతలతో కలిసి ఆయన దీక్ష చేస్తున్నారు. రామకృష్ణ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఇతర నిర్మాతలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. థియేటర్ల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలనీ, గతంలో మాదిరిగా ప్రతి థియేటర్లోనూ మార్నింగ్ షోను చిన్న చిత్రాలకు కేటాయించాలనీ రామకృష్ణ కోరారు. ఇంకా చిన్న నిర్మాతలకు ఎదురవుతున్న పలు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామనీ, సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.