ఏటా రూ.వెయ్యి కోట్లు .. ఇదీ ‘అందాల’ వ్యాపారం

ఏటా రూ.వెయ్యి కోట్లు  .. ఇదీ ‘అందాల’ వ్యాపారం


కాసుల కోసం కాస్మొటిక్ చికిత్సలు

వైద్యుల అనైతిక చర్యలు

నిబంధనలను పట్టించుకోని వైనం

గ్లోబల్ ఆస్పత్రి వైద్యునికి నోటీసులు


 


సిటీబ్యూరో: అందం కోసం ఆరాట పడుతున్న వ్యక్తుల బలహీనత...కాస్మొటిక్ వైద్యులకు... కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి.. ఇలాంటి వారి ఆశను ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. తాము కోరుకున్న రూపం వస్తోందో...లేదో కానీ ఇలాంటి ‘ఆశావహులు’ భారీ మొత్తంలో నష్టపోతున్నారు. కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ‘అందం...శరీరాకృతి’ చికిత్సల పేరిట నగరంలో ఏటా రూ.వెయ్యి కోట్ల వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. ఇలాంటి చికిత్సలు అధిక శాతం విఫలమవుతుండడం గమనార్హం. సమస్యను గుర్తిం చేసరికే కోలుకోలేని నష్టం జరిగిపోతోంది. అత్యవసర శస్త్ర చికిత్సలు మినహా ఎలక్టివ్ సర్జరీలన్నిటికీ బంధువుల అనుమతి అవసరం. బోయిన్‌పల్లికి చెందిన గోవర్థన్‌రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డి(22) విషయంలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ఇవేవీ పట్టించుకోలేదు. ఐదడుగుల కంటే తక్కువ ఉన్న వారికే ఎత్తును పెంచే శస్త్రచికిత్స చేయాలనేది నిబంధన. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్ రెడ్డికి శస్త్రచికిత్స చేయడాన్ని పరిశీలిస్తే కాసుల కోసం నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు ఎంతకు దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చు.


 గుట్టు చప్పుడు కాకుండా..


ఇప్పటి వరకు అవసరం లేకపోయినా సిజేరియన్లు చేయడం... సాధారణ కడుపు నొప్పికి కూడా అంపెండిసైటిస్ పేరుతో శస్త్రచికిత్స చేయడం, సరోగసీ పేరుతో మాతృత్వాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముతున్న వైనం నగరంలో చాలా కాలంగా కొనసాగుతున్నదే. తాజాగా వైద్యులు రూటు మార్చారు. కష్టపడకుండానే సన్నబడాలని.. ముక్కు, ముఖం అందంగా కనిపించాలని... ఆరడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షించాలని ఆరాట పడేవారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. లెఫోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీ, రీనోప్లాస్టీ (ముక్కు వంకరలు సరి చేసుకోవడం), లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు వేసుకోవడం), హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ ంటి శస్త్రచికిత్సలు దాదాపు అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు చేస్తున్నాయి. నగరంలో బెరియాట్రిక్ సర్జరీలు నెలకు 100-150 వరకు... లైఫోసక్షన్ శస్త్రచికిత్సలు 1500-2000 వరకు జరుగుతున్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రీనోప్లాస్టీ, బ్రెస్ట్, లాసిక్ సర్జరీల సంఖ్య లెక్కే లేదు. ఇటీవల పొట్టిగా ఉన్న వారి ఎత్తు పెంచేందుకూ చికిత్సలు పెరిగాయి. వీటి ద్వారా ఏటా రూ.వెయ్యి కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా.


 
ఎంసీఐ నిబంధనలు ఇవీ..

నిజానికి బోన్ క్యాన్సర్, పోలియో, ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకరలు పోవడం, ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినవారికి ఈ తరహా చికిత్సలు చేయవచ్చు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం ఐదడుగుల కంటేతక్కువ ఎత్తు... ఒక కాలు పొడవు... మరొక కాలు పొట్టిగా ఉన్న వారికి ఈ తరహా శస్త్రచికిత్సలతో రెండు నుంచి మూడు అంగుళాల వరకు ఎత్తు పెంచుకునే అవ కాశం ఉంది. ఎముకలను పెంచినంతసులభంగా కండరాలు, నరాలను పెంచలేరు. అంతకు మించి ఎత్తు పెంచితే కండరాలు, నరాలు బిగుసుకుపోతాయి. మోకాళ్ల పనితీరు దెబ్బ తింటుంది. రోగి కోలుకోవడానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది. బెడ్‌రెస్ట్, వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్ వల్ల శస్త్రచికిత్స చేయించుకున్న భాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందని సీనియర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత ్సలో ఉన్న రిస్క్... ఆ తర్వాత తలెత్తే పరిణామాలను ముందే రోగి సహా బంధువులకు వివరించాలి. పూర్తి స్థాయి కౌన్సెలింగ్ తర్వాతే శస్త్రచికిత్స చేయాలి. కానీ నగరంలోని కొంతమంది వైద్యులు ఇవేవీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స చేస్తున్నారు.


 


వైద్యుడికి నోటీసులు

కాస్మొటిక్ శస్త్రచికిత్సల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఆస్పత్రులు, వైద్యులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా... కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా నిఖిల్‌రెడ్డికి ఎత్తుపెంచే శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్‌కు బుధవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఆయనను విచారించనున్నట్లు స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తేలితే సంబంధిత వైద్యుడిపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top