మహిళలను దేవదాసీలుగా మార్చడం నిషేధం | The state government has issued orders | Sakshi
Sakshi News home page

మహిళలను దేవదాసీలుగా మార్చడం నిషేధం

Jun 1 2016 12:34 AM | Updated on Sep 15 2018 3:01 PM

దేవదాసి పేరిట మహిళను తాళి, ధారణ, దీక్ష వంటి వాటి ద్వారా హిందుదేవతలు, విగ్రహాలు, దేవాలయాలకు అంకితం చేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: దేవదాసి పేరిట మహిళను తాళి, ధారణ, దీక్ష వంటి వాటి ద్వారా హిందుదేవతలు, విగ్రహాలు, దేవాలయాలకు అంకితం చేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం దేవదాసి (ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్) నిబంధనలు- 2016ను రూపొందించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. బసవి, జోగిని, మాతమ్మ, తాయమ్మల పేరిట ఏ మహిళనైనా దేవాలయాలకు అంకితం చేయడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్‌లో నిబంధనలను పొందుపరిచింది. మహిళలను దేవదాసీలుగా అంకితం చేయడం చట్టవ్యతిరేకమైనదని స్పష్టం చేసింది.

మహిళలను దేవదాసీలుగా చేయడంలో పాత్ర ఉన్న ఎవరికైనా మూడేళ్ల వరకు జైలు, రూ.2-3 వేల వరకు జరిమానా విధించాలని పేర్కొంది. అదే తల్లిదండ్రులు, బంధువులైతే వారికి అయిదేళ్ల వరకు జైలు, రూ.3-5 వేల వరకు జరిమానా విధించాలని పేర్కొంది. దీనిని నిర్వహించేవారు, ప్రచారం చేసేవారు, మద్దతు తెలిపే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసుల విచారణను జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్/తహసీల్దార్/ఎమ్మార్వోలు చేపడతారని పేర్కొంది.

 మంత్రి చైర్మన్‌గా రాష్ట్రస్థాయి కమిటీ
 మహిళలను దేవదాసీలుగా మార్చకుండా నియంత్రించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి చైర్మన్‌గా, హోం, గిరిజన, బీసీ, మహిళా, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శి, ఎస్సీశాఖ కమిషనర్/డెరైక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఇద్దరు సభ్యులుగా, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్రస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. జిల్లా స్థాయిలో అదనపు జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, ఏఎస్‌పీ, అన్ని డివిజన్ల ఆర్డీవోలు, రిటైర్డ్ జిల్లా జడ్జీ/అదనపు జిల్లా మెజిస్ట్రేట్/జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఇద్దరు సభ్యులుగా, జిల్లా ఎస్సీ అభివృది ్ధశాఖ జేడీ/డీడీ మెంబర్ కన్వీనర్‌గా జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

 సాయం ఇలా..
 దేవదాసీలకు సహాయం, పునరావాసం కింద ఇళ్లు, ఉపాధి పొందేందుకు ఆర్థికసహాయం, పిల్లలకు 12వ తరగతి వరకు ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ స్కూళ్లలో ఉచిత విద్య, కులాంతర/కల్యాణలక్ష్మి కింద ఇచ్చే ప్రోత్సాహాకాలను అందించనున్నారు. మంగళవారం ఈ మేరకు ఎస్సీ శాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement