కృష్ణా జలాల వినియోగంలో పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తొలిసారిగా తెలంగాణ తాగునీటి అవసరాలపై స్పందించింది.
తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వినియోగం లో పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తొలిసారిగా తెలంగాణ తాగునీటి అవసరాలపై స్పందించింది. తెలంగాణ నీటి అవసరాలు ఏమిటో చెప్పాలంటూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
హైదరాబాద్ తాగునీటి అవసరాలు సహా, సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్‌పీ కింద తాగునీటికి ఏ మేర నీటి అవసరాలు ఉంటాయో చెప్పాలని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తన లేఖలో కోరారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, నీటిని తోడేందుకు ఉన్న అవకాశాలపై వివరాలు తమ ముందుంచాలన్నారు. నీటి అవసరాలను పేర్కొంటే అందుకు అనుగుణంగా నీటి లభ్యతను బట్టి నిర్ణయం చేస్తామని వెల్లడించారు.