మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ | Swine flu again | Sakshi
Sakshi News home page

మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ

Jan 19 2017 4:24 AM | Updated on Oct 9 2018 7:11 PM

మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ - Sakshi

మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ

గ్రేటర్‌లో హెచ్‌1ఎన్‌1(స్వైన్‌ఫ్లూ కారక) వైరస్‌ మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తోంది.

రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి

  • 18 రోజుల్లో 15 కేసులు నమోదు
  • అప్రమత్తమైన ప్రభుత్వం.. గాంధీలో స్వైన్‌ఫ్లూ ఓపీ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో హెచ్‌1ఎన్‌1(స్వైన్‌ఫ్లూ కారక) వైరస్‌ మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. 18 రోజుల్లో 15 కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(58) మంగళవారం రాత్రి చనిపోగా, జహను మాకు చెందిన సనజ్‌ బేగం(39)సోమవారం మృతి చెందింది. అలాగే దోమలగూడకు చెందిన మంజుల(35) ఈ నెల 5న మృతి చెందింది. ప్రస్తుతం బహదూర్‌పురాకు చెందిన వృద్ధురాలు (64)లు గాంధీ ఆస్పత్రి డిజాస్టర్‌ వార్డులో చికిత్స పొందుతోంది.

ఇతర ఆస్పత్రుల్లో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో విక్రంపురి, రామంతాపూర్, తిరుమలగిరి, చిలకలగూడ, జవహార్‌నగర్, సుల్తాన్‌బాగ్, ఉస్మాన్‌గంజ్, సైదాబాద్, మలక్‌పేట్, రాణిగంజ్, తీగలకుంట, దోమలగూడకు చెందిన వారే. నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆ మేరకు బుధవారం గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ ఓపీ విభాగాన్ని పునరుద్ధరించింది. ఇన్‌పేషంట్ల కోసం ఎనిమిదో అంతస్థులోని స్వైన్‌ఫ్లూ వార్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

హైరిస్క్‌ గ్రూప్‌ను వెంటాడుతున్న ఫ్లూ భయం...
ఇదిలా ఉంటే ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బందిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా వర్గాలన్ని ఆందోళన చెందుతున్నాయి. గ్రేటర్‌లోని కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకే తరలిస్తుండటంతో వైరస్‌ ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు. గతంలో హైరిస్క్‌ జోన్‌లో పని చేస్తున్న సిబ్బందికి రోగి నుంచి వైరస్‌ సోకిన దాఖలు ఉండటమే ఇందుకు కారణం. వ్యాధి నివారణలో భాగంగా వీరికి ముందస్తు వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా, స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈ మందు మచ్చుకైనా కన్పించడం లేదు. ఫ్లూ బాధితుల వద్దకు వెళ్లడానికి కూడా సిబ్బంది జంకుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి...డాక్టర్‌ మసూద్, గాంధీ ఆస్పత్రి
► సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి.
► ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి.
► గర్భిణులు, శ్వాస కోశ వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధుల కు సులభంగా వ్యాపించే అవకాశం.
► ముక్కుకు మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.
► అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement