మరోపోరుకు ‘సన్’సిద్ధం | Sunrisers Hyderabad vs Rising Pune Super Giants match today | Sakshi
Sakshi News home page

మరోపోరుకు ‘సన్’సిద్ధం

Apr 26 2016 1:34 AM | Updated on Sep 3 2017 10:43 PM

మరోపోరుకు ‘సన్’సిద్ధం

మరోపోరుకు ‘సన్’సిద్ధం

హ్యాట్రిక్’ విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా పుణేతో సమరానికి సై అంటోంది.

నేడు పుణేతో మ్యాచ్ 
సూపర్ ఫామ్‌లో వార్నర్
 

సాక్షి, హైదరాబాద్: ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా పుణేతో సమరానికి సై అంటోంది. ఉప్పల్  స్టేడియంలో మంగళవారం జరిగే మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో సన్ తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రైజర్స్ అనూహ్యంగా పుంజుకొని మూడు వరుస విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో జట్టు ముందంజ వేస్తోంది. మరోవైపు రైజింగ్ పుణేది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యాలతో సాదాసీదా జట్టుగా మిగిలిపోయింది.

 ఆత్మ విశ్వాసంతో వార్నర్ సేన
 ఫామ్ కోసం తంటాలు పడిన ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇప్పుడు టచ్‌లోకి వచ్చాడు. మరోవైపు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో కీలక ఆటగాళ్లు యువరాజ్, ఆశిష్ నెహ్రా గాయాల బారిన పడినా... జట్టు విజయాలకు ఢోకా లేకుండా పోయింది. యువీ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. నెహ్రా ఫిట్‌నెస్‌ను బట్టి మ్యాచ్‌కు ముందు నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో   హైదరాబాద్‌కు సొంతగడ్డపై మరో విజయం ఏమంత కష్టం కాకపోవచ్చు.

 గాడిన పడని సూపర్ జెయింట్స్
పుణేను పరాజయాల భారం కుంగదీస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన ధోని సేన ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. జట్టు కూర్పు కూడా పుణేకు సమస్యగా మారింది. ఇప్పటి వరకు ప్రధాన ఆటగాళ్లెవరూ జట్టును గాడిన పెట్టే ప్రయత్నం చేయలేకపోవడం కోచ్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనిలను కలవరపెడుతోంది. నాలుగు ఓటమిలతో ఉన్న ధోని సేన ప్లే ఆఫ్‌కు చేరాలంటే తదుపరి మ్యాచ్‌ల్లో సమష్టి కృషితో దూసుకెళ్లాల్సిందే.

స్టీవ్ స్మిత్, డుప్లెసిస్, రహానే, పెరీరా, ధోనిలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కాగితాలపై బలంగా కనిపిస్తున్నప్పటికీ మైదానం చేరేసరికి డీలాపడుతోంది. టాప్ ఆర్డర్‌లో ఒకరిద్దరు రాణించడంతో ఫలితాల్లో భారీమూల్యమే చెల్లించుకుంటోంది. ఐదు మ్యాచ్‌లైనా... స్టీవ్ స్మిత్ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ధోనీ మెరుపులు అంతంతే. ఇక పేస్ బౌలింగ్‌లో మీడియం పేసర్ రజత్ భాటియా మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కూడా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రభావమే చూపలేదు. రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్‌లు దీనిపై దృష్టి పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement