గురుకులాల్లో ‘భారత్‌ దర్శన్‌’

Special program for merit students - Sakshi

మెరిట్‌ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనకు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్‌ దర్శన్‌’పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది.  ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు  ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు  దీన్ని అమలు చేస్తోంది.

అవగాహన.. విశ్లేషణ.. 
రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్‌ దర్శన్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. దీని ద్వారా మెరిట్‌ విద్యార్థులను బృందాలుగా విభజించి, సొసైటీ సొంత ఖర్చుతో నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్తారు. విద్యార్థులు అక్కడున్న సామాజిక పరిస్థితులు, ప్రాంతీయ అంశాలను పరిశీలించి, వాటిపై ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా మార్కులుండనప్పటికీ.. దీని వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మకత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఏటా 400 మందికి అవకాశం.. 
ఈ కార్యక్రమం ద్వారా ఏటా 400 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ ద్వారా 200 చొప్పున ఈసారి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటీవల 50 మంది విద్యార్థుల బృందం తమిళనాడు (చెన్నై సమీప ప్రాంతాలు) పర్యటనకు వెళ్లి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా, కర్ణాటక–కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్‌–గుజరాత్‌ రాష్ట్రాలకు మిగతా విద్యార్థులను పంపనున్నట్లు సాంఘిక సంక్షేమ     గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

డిగ్రీ గురుకులాల్లో ప్రత్యేక సబ్జెక్టు...
రాష్ట్ర సామాజిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని గురుకుల సొసైటీ భావిస్తోంది. ఈ మేరకు ‘అండర్‌స్టాండింగ్‌ తెలంగాణ’పేరిట గురుకుల డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ప్రత్యేక సబ్జెక్టును పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనుంది. ఈ కోర్సులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, అవగాహన పెంచుకొని పరీక్షలు రాయాల్సి ఉంటుంది. త్వరలో ఈ కోర్సును ప్రవేశపెడతామని సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  వెల్లడించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top