
అంత ఖర్చు చేశానని నేను చెప్పలేదు
గత సాధారణ ఎన్నికల్లో సుమారు రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని తాను చెప్పలేదని ఏపీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.
ఎన్నికల్లో వ్యయంపై స్పీకర్ కోడెల
సాక్షి, హైదరాబాద్: గత సాధారణ ఎన్నికల్లో సుమారు రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని తాను చెప్పలేదని ఏపీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రూ.11 కోట్ల మేర ఖర్చయిందని తనకు ఎవరో చెప్పారన్న విషయాన్ని బహిర్గతం చేశాను తప్ప అంత మొత్తం ఖర్చు చేశానని చెప్పలేదన్నారు. ఈ విషయంలో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఆయన విమర్శించారు.
అడవుల నరికివేతపై స్పీకర్ ఆందోళన
అంతకుముందు స్పీకర్ కోడెల అధ్యక్షతన వన్యప్రాణి, పర్యావరణ సంరక్షణపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడవుల నరికివేత పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్ని విచక్షణారహితంగా నరికి వేయటం వల్లే పులులు వంటి జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయన్నారు. అడవుల నరికివేత ఇలానే కొనసాగితే ఇలాంటి జంతువులు మరిన్ని జనారణ్యంలోకి వచ్చే వీలుందని ఆందోళన వ్యక్తం చేశారు. అడ వులను పెంచటంతోపాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రజలకు అవసరమైన, వారు ఉపయోగించే మొక్కలను అటవీశాఖ అందించాలన్నారు. అప్పుడే మొక్కల పెంపకం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని, సానుకూల ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.