అ‘ధన’పు దోపిడీ

అ‘ధన’పు  దోపిడీ


సంక్రాంతికి ప్రత్యేక టికెట్ ధరలు

మళ్లీ 50 శాతం పెంచుతున్న ఆర్టీసీ

డీజిల్ ధరలు తగ్గినా రూటు మారని వైనం

అదే బాటలో ప్రైవేట్ ట్రావెల్స్


 

సిటీబ్యూరో: సంక్రాంతి దోపిడీ వైపు ఆర్టీసీ చక్రం పరుగులెడుతోంది. ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు వసూళ్లకు ఆ సంస్థ తెరలేపింది. ఇటీవల కాలంలో డీజిల్ ధరలు బాగా తగ్గినప్పటికీ ప్రయాణికులను వదలడం లేదు. వారిపై అదనపు భారాన్ని మోపేందుకే సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు  5,560 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైద రాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జనవరి 8నుంచి 13వ తేదీ వరకు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. రైళ్లన్నీ నిండిపోవడం.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రైవేట్ ఆపరేటర్లు ఇప్పటికే చార్జీలను రె ట్టింపు చేసి దోచుకుంటుండగా...వారికి తాము ఏమాత్రం తీసిపోమనే రీతిలో ఆర్టీసీ సైతం  అదే బాటలో నడుస్తోంది. ఉభయ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌కు తెప్పించేందుకు ఆర్టీసీపై పడే ఇంధన భారం దృష్ట్యా మాత్రమే అదనపు చార్జీలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం.



అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం



పండగ రద్దీ దృష్ట్యా నగరం నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, కర్నూలు, కడప, తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో జనవరి 9, 10 తేదీలకు 75 శాతానికి పైగా సీట్లు నిండినట్లు ఈడీ తెలిపారు.  దీంతో ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 10 శాతం సీట్లు నిండాయి. ఆంధ్రా వైపు 2,835 ప్రత్యేక బస్సులు, తెలంగాణలో 2,720 బస్సులు వేస్తున్నట్టు తెలిపారు. వీటన్నిటికీఅదనపు చార్జీలు వర్తిస్తాయి. వీటికి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. నగరంలోని 350కి పైగా ఏటీబీ కేంద్రాలు, ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లు, ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 9, 10, 11 తేదీల్లో రద్దీ బాగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ మేరకు 9వతేదీన 1345 బస్సులు, 10న 1,510, 11న610 సర్వీసులు నడపనున్నారు. సుమారు 500 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలు అందించనున్నారు.



దారి మళ్లింపు



సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌కు వచ్చే బస్సులను నగర శివార్ల నుంచే నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్‌ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ హేంగర్ (గౌలిగూడ) నుంచి నడుపుతారు.నల్గొండ, మిరియాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, ఎల్‌బీనగర్‌ల నుంచి నడుస్తాయి.

     

వరంగల్, యాదగిరిగుట్ట, హన్మకొండ, జనగామ బస్సులను ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నడుపుతారు.విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర రూట్ల బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి నడుస్తాయి.ఎల్‌బీనగర్, ఉప్పల్ రింగు రోడ్డు వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చేస్తారు.గౌలిగూడ, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లలో అనౌన్స్‌మెంట్‌తో పాటు, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు.



షటిల్ బస్సులు



మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల మధ్య ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉండేలా సిటీ బస్సులు నడుపుతారు. ఇవిఎంజీబీఎస్‌లో 51వ ప్లాట్‌ఫామ్ నుంచి 55 వరకు ఉంటాయి.ఉప్పల్ వైపు వెళ్లే సిటీ బస్సులు ఎంజీబీఎస్‌లో 41 నుంచి 46 ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఆగుతాయి. ఎల్‌బీనగర్‌కు వెళ్లే సిటీ బస్సులు 15వ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగుతాయి.



http://img.sakshi.net/images/cms/2014-12/81419446899_Unknown.jpg

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top