అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేదు

అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేదు


♦ ఇతర రాష్ట్రాలూ కోరే వీలుంది

♦ పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి

♦ డీ లిమిటేషన్ కమిటీ వేసినా ఆరేడేళ్లు పట్టే పరిస్థితి

♦ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదు

♦ ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో..?

♦ మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ

 

 సాక్షి, హైదరాబాద్, గుంటూరు (కొరిటెపాడు): రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు పెంచడానికి అవకాశం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని తన నివాసంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతారనే వాదన తాజాగా వినపడుతోంది. అయితే రాష్ట్ర విభజన చట్టం గెజిట్‌లో సెక్షన్-26 కింద రాజ్యాంగంలోని 170 అధికరణకు లోబడి మాత్రమే ఉభయ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతాం అనే మాటను పొందుపరిచారు. దీని ప్రకారం రాజ్యాంగ సవరణ చేయకుండా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని శివాజీ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలని, దీంతోపాటు దేశంలోని మెజార్టీ శాసనసభలు తీర్మానాలు చేయాల్సి ఉంటుందని వివరించారు.



 గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సాధ్యం కాదన్నారు..

 అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణకు డీలిమిటేషన్ కమిటీ కూడా వేయాల్సి ఉందని శివాజీ తెలిపారు. 2002లో కులదీప్‌సింగ్ అధ్యక్షతన డీలిమిటేషన్ కమిటీ వేయగా.. ఆ కమిటీ నిర్ణయాలు 2009 ఎన్నికల్లో అమల్లోకి వచ్చాయని తెలిపారు. దీని ప్రకారం ఒకవేళ కేంద్రం పునర్వ్యవస్థీకరణ కమిటీని వేసినా అమలుకు ఆరేడేళ్లు పట్టే పరిస్థితి ఉంటుందని వివరించారు. గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని అప్పట్లో ఒక ప్రకటన చేశారని గుర్తుచేశారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని వారందరితో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని, లేకుంటే లేనిపోని ఉపద్రవాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.



 ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో?

 పార్టీలు, రాష్ట్రాలు కోరినట్లు తొందరపడి శాసనసభా స్థానాలను పెంచేయడానికి సాధ్యం కాదని, ఎవరికి వారు ఎందుకు ఇష్టారీతిన మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. 1970-71లో వేసిన పునర్వ్యవస్థీకరణ కమిటీ నిర్ణయాలు 1978 ఎన్నికలకు గాని అమల్లోకి రాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రేపు, ఎల్లుండి శాసనసభ స్థానాల సంఖ్య పెరుగుతాయని అనడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదని, ఆచితూచి అడుగులు వేయాలే తప్ప ఇష్టానుసారం చెప్పడానికి వీల్లేదన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించారని, చట్టసభల కాలపరిమితిని 5 ఏళ్లు, 7 ఏళ్లుగా పెట్టారని, దీనికి 42వ రాజ్యాంగం ద్వారా మెజార్టీ శాసనసభలు తీర్మానం చేశాయని యలమంచిలి శివాజీ పేర్కొన్నారు.

 

 రాజ్యాంగ స్వరూపం, స్వభావాలు మార్చడానికి వీల్లేదు

 రాజ్యాంగ స్వరూపం, స్వభావం, ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి వీల్లేదని శివాజీ ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడానికి సాధ్యం కాదని గతేడాది ఫిబ్రవరి 7న లోక్‌సభలో కేంద్రం తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. గతంలోనూ నియోజకవర్గ కేంద్రాల స్థానాలు మారా యే తప్ప సంఖ్య మారలేదన్నారు. తాజా వాదన లేవనెత్తితే ఇతర రాష్ట్రాలు కూడా శాసనసభ స్థానాలు పెంచాలనే డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఉత్తరాంచల్‌లో 70 అసెంబ్లీ స్థానాలను 101కి, జార్ఖండ్ 81 నుంచి 160 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలను ఇంకా పెంచాలని ఇటీవల కోరుతున్నాయని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top