breaking news
Assembly Seats increase
-
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్ నోటీఫికేషన్ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్–15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం–2014లో సెక్షన్–26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి. జన గణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కశ్మిర్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్–26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా:జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై... విడిగా విచారణ: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని జమ్మూకశ్మీర్ కేసుతో కాకుండా విడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల ధర్మాసనం విచారించింది. జమ్ము కశ్మీర్ అంశంతో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఎలా జత చేస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. జమ్ము కశ్మీర్ చట్టం 2019లో చేశారని, ఏపీ పునర్విభజన చట్టం 2014లోనే చేశారని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, రావు రంజిత్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏకీభవించని ధర్మాసనం జమ్మూకశ్మీర్ అంశంతో తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో సీట్లపెంపు పిటిషన్లను వేరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ
-
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఆగాల్సిందే!: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం సమాధానం ఇచ్చింది. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం బుధవారం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరం. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి.. ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు. చదవండి: 12వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలు -
అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేదు
♦ ఇతర రాష్ట్రాలూ కోరే వీలుంది ♦ పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి ♦ డీ లిమిటేషన్ కమిటీ వేసినా ఆరేడేళ్లు పట్టే పరిస్థితి ♦ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదు ♦ ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో..? ♦ మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ సాక్షి, హైదరాబాద్, గుంటూరు (కొరిటెపాడు): రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు పెంచడానికి అవకాశం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని తన నివాసంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతారనే వాదన తాజాగా వినపడుతోంది. అయితే రాష్ట్ర విభజన చట్టం గెజిట్‌లో సెక్షన్-26 కింద రాజ్యాంగంలోని 170 అధికరణకు లోబడి మాత్రమే ఉభయ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతాం అనే మాటను పొందుపరిచారు. దీని ప్రకారం రాజ్యాంగ సవరణ చేయకుండా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని శివాజీ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలని, దీంతోపాటు దేశంలోని మెజార్టీ శాసనసభలు తీర్మానాలు చేయాల్సి ఉంటుందని వివరించారు. గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సాధ్యం కాదన్నారు.. అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణకు డీలిమిటేషన్ కమిటీ కూడా వేయాల్సి ఉందని శివాజీ తెలిపారు. 2002లో కులదీప్‌సింగ్ అధ్యక్షతన డీలిమిటేషన్ కమిటీ వేయగా.. ఆ కమిటీ నిర్ణయాలు 2009 ఎన్నికల్లో అమల్లోకి వచ్చాయని తెలిపారు. దీని ప్రకారం ఒకవేళ కేంద్రం పునర్వ్యవస్థీకరణ కమిటీని వేసినా అమలుకు ఆరేడేళ్లు పట్టే పరిస్థితి ఉంటుందని వివరించారు. గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని అప్పట్లో ఒక ప్రకటన చేశారని గుర్తుచేశారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని వారందరితో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని, లేకుంటే లేనిపోని ఉపద్రవాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో? పార్టీలు, రాష్ట్రాలు కోరినట్లు తొందరపడి శాసనసభా స్థానాలను పెంచేయడానికి సాధ్యం కాదని, ఎవరికి వారు ఎందుకు ఇష్టారీతిన మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. 1970-71లో వేసిన పునర్వ్యవస్థీకరణ కమిటీ నిర్ణయాలు 1978 ఎన్నికలకు గాని అమల్లోకి రాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రేపు, ఎల్లుండి శాసనసభ స్థానాల సంఖ్య పెరుగుతాయని అనడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదని, ఆచితూచి అడుగులు వేయాలే తప్ప ఇష్టానుసారం చెప్పడానికి వీల్లేదన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించారని, చట్టసభల కాలపరిమితిని 5 ఏళ్లు, 7 ఏళ్లుగా పెట్టారని, దీనికి 42వ రాజ్యాంగం ద్వారా మెజార్టీ శాసనసభలు తీర్మానం చేశాయని యలమంచిలి శివాజీ పేర్కొన్నారు. రాజ్యాంగ స్వరూపం, స్వభావాలు మార్చడానికి వీల్లేదు రాజ్యాంగ స్వరూపం, స్వభావం, ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి వీల్లేదని శివాజీ ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడానికి సాధ్యం కాదని గతేడాది ఫిబ్రవరి 7న లోక్‌సభలో కేంద్రం తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. గతంలోనూ నియోజకవర్గ కేంద్రాల స్థానాలు మారా యే తప్ప సంఖ్య మారలేదన్నారు. తాజా వాదన లేవనెత్తితే ఇతర రాష్ట్రాలు కూడా శాసనసభ స్థానాలు పెంచాలనే డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఉత్తరాంచల్‌లో 70 అసెంబ్లీ స్థానాలను 101కి, జార్ఖండ్ 81 నుంచి 160 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలను ఇంకా పెంచాలని ఇటీవల కోరుతున్నాయని వివరించారు.