సిటీ సేఫ్ | No earthquake effect on Hyderabad, says Scientist Dr.Poornachandra Rao | Sakshi
Sakshi News home page

సిటీ సేఫ్

Apr 26 2015 2:28 AM | Updated on Oct 20 2018 6:37 PM

సిటీ సేఫ్ - Sakshi

సిటీ సేఫ్

భూకంపాల విషయంలో హైదారాబాద్ నగరం ‘అత్యంత సేఫ్ జోన్’గా ఎన్‌జీఆర్‌ఐశాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మనకు భూకంప భయం లేదు
నగర వాసులూ... ఆందోళన వద్దు
శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు

ఉప్పల్: భూకంపాల విషయంలో హైదారాబాద్ నగరం ‘అత్యంత సేఫ్ జోన్’గా ఎన్‌జీఆర్‌ఐశాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శనివారం నేపాల్‌లో సంభవించిన భూకంపం భారీ ప్రాణ నష్టాన్ని కలిగించిన నేపథ్యంలో... నగర వాసులలోనూ భవిష్యత్తుపై భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే... నగర జనం భయపడనవసరం లేదని ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.ఎన్.పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. నేపాల్ సంఘటనపై ఆసక్తికర అంశాలను ఆయన వెల్లడించారు. శనివారం నేపాల్‌లో సంభవించిన విపత్తు ముందుగా ఊహించిందేనన్నారు. అక్కడ భూకంపాలు వచ్చే ఆవకాశాలు ఉన్నాయని గతంలో భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారని గుర్తు చేశారు. నేపాల్‌ను సైస్మిక్ గ్యాప్‌గా గుర్తించమని తెలిపారు. అయితే ఎప్పుడు వచ్చేదీ చెప్పడం సాధ్యపడదని చెప్పారు.

ఈ భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 7.9గా నమోదైందని... దాదాపుగా 50 సెకన్ల పాటు కంపించినట్లు గుర్తించామన్నారు. భూమి పొరలో వచ్చిన కదలికల వల్ల నగరంలో చిన్న చిన్న భూ ప్రకంపనలు గతంలో వచ్చిన మాట వాస్తవమేనన్నారు. వీటి వల్ల పెద్దగా ప్రమాదం లేదని ఆయన చెప్పారు. ఆంధ్ర, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనూ శనివారం ప్రకంపనలు ఉన్నాయన్నారు.

గోదావరి పరీవాహక ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరం జోన్ -2 పరిధిలో ఉందని... అంటే ‘సేఫ్’ ప్రాంతమని తెలిపారు. గోదావరి, కోస్తా ఆంధ్రాలు జోన్ -3 పరిధిలో ఉన్నాయని... ఢిల్లీ తదితర ప్రాంతాలు జోన్-4 పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు.
 
నేపాల్‌లో దుర్ఘటనతో నేర్చుకోవాల్సిన అంశాలు..
నేపాల్ దుర్ఘటన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని డా.పూర్ణచంద్రరావు తెలిపారు. గతంలో భూకంపాల అధ్యయనానికి  అవకాశం లేదని... ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఈ భూకంపం నుంచి ఎన్నో అంశాలను నేర్యుకోగలమని తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాత కొత్త అంశాలు పసిగట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
 
ఎన్‌జీఆర్‌ఐలో అత్యవసర సమావేశం
నేపాల్ భూకంప సంఘటనపై ఉప్పల్‌లోని ఎన్‌జీఆర్‌ఐ డెరైక్టర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భూకంపాలు వచ్చే అవకాశాలున్న హిమాలయాలు, కశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెస్మిక్ గ్రాఫ్‌ల నుంచి రికార్డులను తెప్పించుకొని అత్యాధునిక టెక్నాలజీతో కొత్త అంశాలను తెలుసుకునేందుకు వీలుగా సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
 
64 ఏళ్లలో అతి పెద్ద దుర్ఘటన
1950 తర్వాత వచ్చిన భూకంపాల్లో నేపాల్ దుర్ఘటనేఅతి పెద్దదిగా చెప్పుకోవచ్చని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డా.పూర్ణచంద్రారావు తెలిపారు. రెక్టార్ స్కేల్‌పై 7.9గా నమోదు కావడం... 50 సెకన్లకు పైగా భూమి కంపించడం... 60 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పారు. భూమి పొరల్లో 10 కిలోమీటర్ల లోపలి వరకు దీని ప్రభావం ఉందన్నారు. చుట్టూ పట్టణ ప్రాంతాల్లో కూడా పెను ప్రభావం ఉందని... దీని తర్వాత కూడా మరికొన్ని భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
 
ఇవీ జోన్లు...
జోన్ -2: హైదరాబాద్ పరిసర ప్రాంతాలు,
జోన్ -3: ఒంగోలుతో పాటు ఆంధ్ర, గోదావరి, కోస్తా ప్రాంతాలు,
జోన్ -4: ఉత్తర భారతదేశం,
జోన్ -5: ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు.
 
నగరంపై ప్రభావం ఉండదు
భూకంపాల ప్రభావం హైదరాబాద్ నగరంపై అంతగా ఉండదని ట్రిపుల్ ఐటీ ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఈఈఆర్‌సీ) హెడ్ ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్ రామన్‌చర్ల స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ లో శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అంతగా భయపడాల్సిన పనిలేకపోయినా... నగరంలో ఇళ్ల నిర్మాణం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.

విపత్తులను తట్టుకునే రీతిలో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూకంపాలపై అవగాహన కల్పించేందుకు ఈఈఆర్‌సీ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు చిన్న పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement